ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. షూటింగ్ క్రీడాంశం చివరిరోజు భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం కలిపి మూడు పతకాలు వచ్చాయి. ఓవరాల్‌గా భారత షూటర్లు ఈ క్రీడల్లో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 22 పతకాలు గెలిచారు. ఆఖరి రోజు పురుషుల, మహిళల ట్రాప్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరిగాయి.
పురుషుల ట్రాప్ టీమ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టు 361 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల కొత్త రికార్డును నెలకొల్పింది. క్వాలిఫయింగ్‌లో కైనన్ 122 పాయింట్లు, జొరావర్ 120 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్‌కు అర్హత పొందారు.
వ్యక్తిగత విభాగంలో ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో జొరావర్ 23 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... కైనన్ 32 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెల్చుకున్నాడు. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్‌లతో కూడిన భారత జట్టు 337 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది.
రజతంతో ముగింపు...
ఆసియా క్రీడల్లో తొలిసారి పసిడి పతకం సాధించే అవకాశాన్ని భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చేజార్చుకుంది. ఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 22–20, 14–21, 21–18 తో షి యుకీపై గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–15, 21–18తో లియాంగ్ వెకింగ్–చాంగ్ వాంగ్ జంటను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మూడో మ్యాచ్‌లో శ్రీకాంత్ 22–24, 9–21తో లి షిఫెంగ్ చేతిలో ... నాలుగో మ్యాచ్‌లో ధ్రువ్–సాయిప్రతీక్ ద్వయం 6–21, 15–21 తో లియు యుచెన్–జువాన్‌యి ఒయు జోడీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో గాయంతో ఫైనల్‌కు దూరమైన భారత నంబర్‌వన్ ప్రణయ్ స్థానంలో మిథున్ ఆడాల్సి వచ్చింది. మిథున్ 12–21, 4–21 తో హాంగ్యాంగ్ వెంగ్ చేతిలో ఓటమి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment