Ankur Mittal
-
అంకుర్ గురి అదరహో
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన పోటీల్లో అంకుర్ మిట్టల్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో రెండు పతకాలు సాధించాడు. వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకం, టీమ్ ఈవెంట్లో కాంస్యంతో సత్తా చాటుకున్నాడు. ఫైనల్లో అంకుర్ మిట్టల్, ఇయాంగ్ యంగ్ (చైనా) 140 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. అయితే షూట్ ఆఫ్‌లో అంకుర్ 4 పాయింట్లు... ఇయాంగ్ యంగ్ 3 పాయింట్లు సాధించారు. దాంతో అంకుర్‌కు స్వర్ణం... ఇయాంగ్ యంగ్‌కు రజతం ఖాయ మయ్యాయి. అండ్రెజ్ (స్లొవేకియా) కాంస్య పతకం గెలిచాడు. టీమ్ ఈవెంట్లో అంకుర్, అసబ్, శార్దూల్‌లతో కూడిన భారత జట్టు 409 పాయింట్లతో కాంస్యం నెగ్గింది. ఇటలీ జట్టుకు (411) స్వర్ణం, చైనా బృందం (410) రజతం గెలుపొందాయి. మరోవైపు ఇద్దరు భారత మహిళా షూటర్లు త్రుటిలో ఫైనల్ అర్హత కోల్పోయారు. 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో రజతం నెగ్గిన అంజుమ్ మౌద్గిల్... 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మహిళల 25 మీ. పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ పదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఇప్పటి వరకు భారత్ 20 పతకాలు సాధించగా, ఇందులో ఏడు చొప్పున స్వర్ణాలు, రజతాలు, ఆరు కాంస్య పతకాలున్నాయి. -
మరో రెండు స్వర్ణాలు...
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): పతకాల వేటలో ఒకరితో మరొకరు పోటీపడుతూ కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగోరోజు భారత షూటర్లు రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ప్రకాశ్ నంజప్ప స్వర్ణం నెగ్గగా... అమన్‌ప్రీత్ సింగ్ రజతం, జీతూ రాయ్ కాంస్యం సాధించారు. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ పసిడి పతకం కైవసం చేసుకోగా... మహిళల డబుల్ ట్రాప్‌లో శ్రేయసి సింగ్ రజతం గెలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ 15 పతకాలు సాధించం విశేషం. పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో జీతూ రాయ్ 559 పాయింట్లు, అమన్‌ప్రీత్ 543 పాయింట్లు, ప్రకాశ్ నంజప్ప 542 పాయింట్లు సాధించారు. ఫైనల్లో ప్రకాశ్ 222.4 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందగా... అమన్‌ప్రీత్ 222 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 201.9 పాయింట్లో జీతూ మూడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డబుల్ ట్రాప్ ఫైనల్లో అంకుర్ మిట్టల్ 74 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. మాథ్యూ ఫ్రెంచ్ (బ్రిటన్–72 పాయింట్లు) రజతం, నాథన్ లీ (మాల్టా–54 పాయింట్లు) కాంస్యం గెలిచారు. మహిళల డబుల్ ట్రాప్ ఫైనల్లో శ్రేయసి సింగ్ 96 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని సంపాదించింది. ఎమ్మా కాక్స్ (ఆస్ట్రేలియా–103 పాయింట్లు) పసిడి పతకం... రాచెల్ పారిష్ (ఇంగ్లండ్–93 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. -
అంకుర్ ‘పసిడి’ గురి
న్యూఢిల్లీ: ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో అంకుర్ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్ అల్కాబి (యూఏఈ–70 పాయింట్లు) రజతం, సైఫ్ అల్షమ్సీ (యూఏఈ–53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్ దహియా, మొహమ్మద్ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. -
షాట్‌గన్‌లో అంకుర్‌కు స్వర్ణం
అకాపుల్కో(మెక్సికో): భారత షూటర్ అంకుర్ మిట్టల్ ఏఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్ డబుల్ ట్రాప్‌లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 75 పాయింట్లు సాధించిన అంకుర్ అగ్రస్థానంలో నిలిచాడు. అంకుర్‌కు గట్టి పోటీ ఇచ్చిన జేమ్స్ విల్లెట్( ఆస్ట్రేలియా) 73 పాయింట్లతో రజతాన్ని, యింగ్(చైనా) కాంస్య పతకాన్ని సాధించారు. అంతకు ముందు జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌం డ్లో అతను 138 పాయింట్లు స్కోర్ చేసి ఫైనల్‌కు అర్హత సాధించాడు. గత నెల ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ పోటీల్లో విల్లెట్ స్వర్ణం, అంకుర్ రజతం సాధించడం విశేషం. -
గురి అదిరింది
జీతూ–హీనా జంటకు స్వర్ణం రజతం నెగ్గిన అంకుర్ మిట్టల్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత భారత షూటర్లు మెరిశారు. సొంతగడ్డపై జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్‌ను ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ విభాగంలో భారత స్టార్ షూటర్లు జీతూ రాయ్–హీనా సిద్ధూ జతగా బరిలోకి దిగారు. ఫైనల్లో జీతూ–హీనా ద్వయం 5–3తో యుకారి కొనిషి–తొమొయుకి మత్సుదా (జపాన్) జోడీపై గెలిచింది. మూడో స్థానంలో నిలిచిన నఫాస్వన్ యాంగ్‌పైబూన్–కెవిన్ వెంటా (స్లొవేనియా) జంటకు కాంస్య పతకం లభించింది. షూటింగ్ రేంజ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మిక్స్డ్ ఈవెంట్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించినందుకు షూటర్లకు పతకాలు ప్రదానం చేసినా ఫలితాలకు మాత్రం అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. పతకాల పట్టిక జాబితాలో కూడా వీటిని చేర్చలేదు. పాయింట్ తేడాతో...: మరోవైపు పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో అంకుర్ మిట్టల్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కేవలం పాయింట్ తేడా తో అంకుర్‌కు స్వర్ణం చేజారింది. ఫైనల్లో అంకుర్ 74 పాయింట్లు స్కోరు చేశాడు. జేమ్స్ విలెట్ (ఆస్ట్రేలియా) 75 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. జేమ్స్ డీడ్మన్ (బ్రిటన్–56 పాయింట్లు) కాంస్య పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన సంగ్రామ్ దహియా ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కొత్త నిబంధనల ప్రకారం డబుల్ ట్రాప్ ఫైనల్ ఈవెంట్లో షాట్ల సంఖ్యను 50 నుంచి 80 షాట్లకు పెంచారు. 30 షాట్లు పూర్తయిన తర్వాత తక్కువ స్కోరు ఉన్న వారు నిష్క్రమించడం మొదలవుతుంది. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్లో అంకుర్ 137 పాయింట్లతో నాలుగో స్థానంలో, సంగ్రామ్ 138 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించారు. 15 ఏళ్ల శపథ్ భరద్వాజ్ 132 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టాప్–6లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో తేజస్విని సావంత్ 402.4 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ రజతం, కాంస్యం నెగ్గింది. -
14 ఏళ్లకే భారత సీనియర్ జట్టులోకి
మీరట్ షూటర్ శపథ్ ఘనత పాటియాలా: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉత్తరప్రదేశ్ యువ షూటర్ శపథ్ భరద్వాజ్ 14 ఏళ్లకే భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది న్యూఢిల్లీ, మెక్సికో, సైప్రస్‌లలో జరిగే షూటింగ్ ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత ‘డబుల్ ట్రాప్’ జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో శపథ్ విశేషంగా రాణించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో శపథ్ 150 పాయింట్లకు 122 పాయింట్లు... రెండో రౌండ్లో 150 పాయింట్లకు 136 పాయింట్లు స్కోరు చేశాడు. అంకుర్ మిట్టల్ తొలి స్థానంలో, సంగ్రామ్ దహియా మూడో స్థానంలో నిలిచి శపథ్తో కలిసి జాతీయ జట్టులోకి ఎంపికయ్యారు. మీరట్‌లో తొమ్మిదో తరగతి చదువుతోన్న శపథ్ ఇటీవలే జైపూర్‌లో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్ ట్రాప్’ జూనియర్ విభాగంలో రజతం, సీనియర్ విభాగంలో కాంస్యం సాధించాడు. గత జులైలో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి టోర్నీలో శపథ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలు గెలిచాడు.