అంకుర్ ‘పసిడి’ గురి
న్యూఢిల్లీ: ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు.
ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్ అల్కాబి (యూఏఈ–70 పాయింట్లు) రజతం, సైఫ్ అల్‌షమ్సీ (యూఏఈ–53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్ దహియా, మొహమ్మద్ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు.