గెలిస్తే నాకౌట్‌ దశకు  | Indian stars endorse Airbadminton | Sakshi
Sakshi News home page

గెలిస్తే నాకౌట్‌ దశకు 

Published Tue, May 21 2019 12:36 AM | Last Updated on Tue, May 21 2019 12:36 AM

Indian stars endorse Airbadminton - Sakshi

నానింగ్‌ (చైనా): క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ తొలి లక్ష్యంగా సుదిర్మన్‌ కప్‌లో భారత జట్టు తమ పోరాటాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ అయిన సుదిర్మన్‌ కప్‌లో భారత్‌ రెండుసార్లు (2011, 2017లలో) క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. అయితే ఆ రెండుసార్లు క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయింది. మంగళవారం జరిగే గ్రూప్‌–డి మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ ఆడనుంది. ఇదే గ్రూప్‌ తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో మలేసియా ఓడిపోయింది. ఫలితంగా నేడు మలేసియాపై భారత్‌ గెలిస్తే నేరుగా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన చైనాపై భారత్‌ గెలవాల్సి ఉంటుంది. దిగ్గజ ఆటగాడు లీ చోంగ్‌ వీ లేకపోవడంతో మలేసియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోవాలి. అయితే భారత విజయావకాశాలు డబుల్స్‌ జోడీల ప్రదర్శనపై ఆధారపడి ఉంది.

పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ లేదా సమీర్‌ వర్మ, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు లేదా సైనా నెహ్వాల్‌ బరిలోకి దిగి విజయం సాధిస్తే భారత్‌ 2–0తో ఆధిక్యంలోకి వెళ్తుంది. ఆ తర్వాత పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ ఒక్కటి నెగ్గినా విజయం ఖాయమవుతుంది. 13 మంది సభ్యులుగల భారత బృందానికి ఈసారి ఎనిమిదో సీడింగ్‌ లభించింది. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మలేసియా జట్టుపై నెగ్గి భారత్‌ స్వర్ణ పతకాన్ని సాధించింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా భారత్‌ చెలరేగితే ముందంజ వేయడం ఖాయం. మలేసియాతో మ్యాచ్‌ అనంతరం బుధవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో పదిసార్లు చాంపియన్‌ చైనాతో భారత్‌ ఆడుతుంది. 

భారత జట్టు: కిడాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ (పురుషుల సింగిల్స్‌), పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ (మహిళల సింగిల్స్‌), సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి, సుమీత్‌ రెడ్డి, మను అత్రి, ప్రణవ్‌ చోప్రా (పురుషుల డబుల్స్‌), అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, మేఘన, పూర్వీషా రామ్‌ (మహిళల డబుల్స్‌). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement