శార్దూల్ ఠాకూర్‌కు చోటు
► వైస్‌కెప్టెన్‌గా రహానే
► షమీ పునరాగమనం
► వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు
ముంబై: వెస్టిండీస్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ కోసం సెలక్టర్లు సోమవారం భారత జట్టును ప్రకటించారు. రెండు మార్పులు మినహా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన జట్టుపైనే కమిటీ నమ్మకముంచింది. ఆ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో కొత్త ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడని మరో పేసర్ మొహమ్మద్ షమీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. టీమ్‌తో పాటు ఉన్నా, మ్యాచ్ ఆడని గుర్‌కీరత్ సింగ్‌ను తప్పించారు. 17 మంది సభ్యుల జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఫార్మాట్‌లో కీలక ఆటగాడిగా ఎదిగిన అజింక్య రహానేకు తొలి సారి టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ అవకాశం దక్కడం విశేషం.
ముంబైకి చెందిన 24 ఏళ్ల శార్దూల్ ఒక్కడే ఈ టీమ్‌లో పూర్తిగా కొత్త ఆటగాడు. నాలుగేళ్ల క్రితం రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టిన అతను 37 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 27.53 సగటుతో 133 వికెట్లు పడగొట్టాడు. 2014-15 సీజన్‌లో 48 వికెట్లతో సంయుక్తంగా రంజీ టాపర్‌గా నిలిచిన శార్దుల్... 2015-16 సీజన్‌లో 41 వికెట్లు తీసి ముంబై చాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనే అతనికి టెస్టు జట్టులో చోటు కల్పించింది. ఇంకా తుది తేదీలు ఖరారు కాని ఈ పర్యటనలో భారత్, విండీస్‌తో నాలుగు టెస్టులు ఆడుతుంది.
ఐపీఎల్‌లో పట్టించుకోకపోయినా...: రెండు వారాల క్రితం పనికి రాడంటూ ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతడిని ఇంటికి పంపించింది. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ నేరుగా టీమిండియాకే ఎంపికయ్యాడు. 2014నుంచి మూడు సీజన్లలో కలిపి ఐపీఎల్‌లో అతడిని పంజాబ్ కేవలం ఒకే మ్యాచ్‌లో ఆడించింది. తనను తప్పించిన తర్వాత అసహనంతో ‘ఐపీఎల్ నిజంగానే అద్భుతాలు చేసింది’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన శార్దూల్‌కు ఇప్పుడు సరైన అవకాశం లభించింది. ముంబై కీలక బౌలర్‌గా అతని ప్రదర్శనను సెలక్టర్లు గుర్తించారు