గంభీర్‌పై సెహ్వాగ్ విమర్శలు
దిల్లీ: ఆ ఇద్దరు.. ఒకప్పడు భారత క్రికెట్ జట్టుకు డాషింగ్ ఓపెనింగ్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరూ క్రీజులో కుదురుకుందంటే.. భారత విజయం ఖరారైనట్లే! వారెవరో కాదు. ఢిల్లీ ఆటగాళ్లు.. గంభీర్, సెహ్వాగ్! ఇంతకాలం మిత్రుల్లా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు విమర్శల వాగ్బాణాలకు దిగుతున్నారు. సోషల్‌మీడియాలో ట్వీట్ షాట్లతో అలరించే సెహ్వాగ్ మీడియా ముందు కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఐపీఎల్–10వ సీజన్ కోసం బెంగళూరులో జరిగిన వేలంలో ఇషాంత్ అమ్ముడుపోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు గంభీర్ ‘నాలుగు ఓవర్లు వేసే ఆటగాడి కోసం ఏ జట్టైనా రూ.2కోట్లు ఖర్చు భరించలేదు’ అని అన్నాడు.
రూ.2కోట్ల కనీస ధరతో ఇషాంత్ వేలంలో పాల్గొన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్‌గా ఉన్న సెహ్వాగ్ సూచనతో ఇషాంత్‌ను పంజాబ్ ఫ్రాంఛైజీ జట్టులోకి తీసుకుంది. ఇటీవల పంజాబ్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు సెహ్వాగ్ ముందుంచారు. దీనికి సెహ్వాగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘60 బంతులు కూడా ఆడని నీకోసం రూ.12కోట్లు ఎవరు వెచ్చిస్తున్నారు’ అంటూ ఎత్తి పొడిచాడు. తోటి ఆటగాడి విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలకు సెహ్వాగ్ బాగానే చురకలంటించాడు.