కోల్‌కతా కుమ్మేసింది | Kolkata Knight Riders beat gujarat lions | Sakshi
Sakshi News home page

కోల్‌కతా కుమ్మేసింది

Published Sat, Apr 8 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

కోల్‌కతా కుమ్మేసింది

కోల్‌కతా కుమ్మేసింది

10 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌పై ఘనవిజయం 
చెలరేగిన లిన్, గంభీర్‌


కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. గత సీజన్‌లో లయన్స్‌ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న గంభీర్‌ సేన వారి సొంతగడ్డపైనే బెబ్బులిలా గర్జించింది. క్రిస్‌ లిన్‌ ఊచకోతకు కెప్టెన్‌ గంభీర్‌ సొగసైన షాట్లు తోడవ్వడంతో లయన్స్‌ ఈసారి తోక ముడిచింది. ఏమాత్రం పసలేని బౌలింగ్‌కు తోడు పేలవ ఫీల్డింగ్‌ను సొమ్ము చేసుకున్న కోల్‌కతా ఓపెనర్లు ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ సాగించిన విధ్వంసాన్ని రైనా బృందం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది.  

రాజ్‌కోట్‌: మూడో టైటిల్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ పదో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. క్రిస్‌ లిన్‌ (41 బంతుల్లో 93 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్‌ గంభీర్‌ (48 బంతుల్లో 76 నాటౌట్‌; 12 ఫోర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో... శుక్రవారం ఎస్‌సీఏ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) 10 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ను చిత్తు చేసింది. జట్టు కూర్పులో నాణ్యమైన ఆల్‌రౌండర్‌ లేకపోవడం లయన్స్‌ను దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 183 పరుగులు చేసింది.

కెప్టెన్‌ సురేశ్‌ రైనా (51 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు), దినేశ్‌ కార్తీక్‌ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్‌కు 87 పరుగులు జత చేరాయి. ఓపెనర్‌ మెకల్లమ్‌ (24 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. కుల్దీప్‌ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 14.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 184 పరుగులు చేసి నెగ్గింది. లిన్, గంభీర్‌ తమ విజృంభణతో జట్టుకు ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లిన్‌కు దక్కింది.

గౌతీ, లిన్‌ల విధ్వంసం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా తమ తొలి ఓవర్‌లో ఏడు పరుగులే చేసినా... ఆ తర్వాత ఓపెనర్లు గంభీర్, లిన్‌ ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగారు. మూడో ఓవర్‌లో లిన్‌ ఓ ఫోర్, సిక్స్‌తో చెలరేగగా, గంభీర్‌ బౌండరీ బాదాడు. దీంతో మన్‌ప్రీత్‌ గోని వేసిన ఆ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. ఇక ఆరో ఓవర్‌లో గౌతీ నాలుగు ఫోర్లతో రెచ్చిపోవడంతో వపర్‌ప్లేలో తొలిసారిగా కోల్‌కతా అత్యధికంగా 73 పరుగులు చేసింది. ఇక ఏడో ఓవర్‌లో లిన్‌.. స్మిత్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఏకంగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదడంతో 19 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయ్యింది. 8 ఓవర్లలోనే కేకేఆర్‌ సెంచరీ మార్కు దాటింది. అటు గంభీర్‌ 33 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. గోని మరో సారి బౌలింగ్‌కు దిగగా గంభీర్‌ మూడు ఫోర్లు బాది 15 పరుగులు సాధించాడు. ఇక 15వ ఓవర్‌లో లిన్‌ ఇచ్చిన క్యాచ్‌ను మెకల్లమ్‌ బౌండరీ లైన్‌ దగ్గర వదిలేయడంతో సిక్స్‌గా వెళ్లింది. ఆ తర్వాత వరుసగా 4,6 సహా మొత్తం 22 పరుగులు రాబట్టి జట్టుకు కావాల్సిన విజయాన్ని అందించాడు.

రైనా జోరు
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ లయన్స్‌కు నాలుగో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు) చావ్లా బౌలింగ్‌లో పేలవ షాట్‌కు వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బ్రెండన్‌ మెకల్లమ్‌తో జతకలిసిన రైనా బ్యాట్‌ను ఝుళిపించాడు. దీంతో పవర్‌ప్లేలో లయన్స్‌ 52 పరుగులు చేసింది. ఏడో ఓవర్‌ చివరి రెండు బంతులను మెకల్లమ్‌ 4,6గా మలిచాడు. అయితే వీరి జోరుకు తొమ్మిదో ఓవర్‌లో కుల్దీప్‌ యాదవ్‌ అడ్డుకట్ట వేశాడు. ఆ ఓవర్‌ తొలి బంతికే మెకల్లమ్‌ను ఎల్బీగా అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 16వ ఓవర్‌లో రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్న రైనా 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు దినేశ్‌ కార్తీక్‌ అడపాదడపా బౌండరీలతో సహకారం అందించడంతో నిలకడగా పరుగులు వ చ్చాయి. చివరి 4 ఓవర్లలో వీరిద్దరి జోరు కు లయన్స్‌ 53 పరుగులు రాబట్టింది.

స్కోరు వివరాలు
గుజరాత్‌ లయన్స్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) యూసుఫ్‌ (బి) చావ్లా 14; మెకల్లమ్‌ ఎల్బీడబ్లు్య (బి) కుల్దీప్‌ యాదవ్‌ 35; రైనా (నాటౌట్‌) 68; ఫించ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 15; దినేశ్‌ కార్తీక్‌ (సి) సుర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 47; స్మిత్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 183.

వికెట్ల పతనం: 1–22, 2–72, 3–92, 4–179; బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–40–1; చావ్లా 4–0–33–1, నరైన్‌ 4–0–33–0; వోక్స్‌ 3–0–35–0; కుల్దీప్‌ 4–0–25–2; పఠాన్‌ 1–0–15–0.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గంభీర్‌ (నాటౌట్‌) 76; లిన్‌ (నాటౌట్‌) 93; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (14.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 184. బౌలింగ్‌: ప్రవీణ్‌ 2–0–13–0; ధావల్‌ 2.5–0–42–0; గోని 2–0–32–0; కౌశిక్‌ 4–0–40–0; డ్వేన్‌ స్మిత్‌ 1–0–23–0; జకాతి 3–0–30–0.

1    టి20 క్రికెట్‌లో వికెట్‌ నష్టపోకుండా అత్యధిక లక్ష్య ఛేదన (184) చేసిన జట్టు కోల్‌కతా.
1    ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (4,110)ని అధిగమించిన సురేశ్‌ రైనా (4,166).

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లు
పంజాబ్‌ & రైజింగ్‌ పుణే
వేదిక: ఇండోర్‌;   సా. గం. 4.00 నుంచి

బెంగళూరు  & ఢిల్లీ డేర్‌డెవిల్స్‌
వేదిక: బెంగళూరు;  రా. గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement