అమ్మాయిల ‘పట్టు’ అదిరింది
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నీలో రన్నరప్ భారత్
అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్ కప్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా రెజ్లింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి. వినేశ్ (48 కేజీలు), లలితా షెరావత్ (55 కేజీలు), అనిత (63 కేజీలు) అజేయంగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... సాక్షి మలిక్ (58 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకుంది. నిర్మలా దేవి (53 కేజీలు), సరిత (60 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు), నిక్కీ (75 కేజీలు) కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు 10 వేల డాలర్లు ప్రైజ్‌మనీగా లభించాయి. ఆతిథ్య దేశం కజకిస్తాన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, మంగోలియా మూడో స్థానంలో నిలిచింది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సన్నాహ కంగా భారత్ ఈ టోర్నీలో ఆడింది.