
కఠ్మాండు: భారత యువ ఫుట్‌బాల్ జట్టు దక్షిణాసియా టోర్నీలో సత్తా చాటింది. మెరుగైన ప్రదర్శనతో అండర్–18 ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ 2–1తో బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. భారత ఆటగాళ్లు విక్రమ్ ప్రతాప్ సింగ్, రవి బహదూర్ రాణా చెరో గోల్‌తో మెరిశారు. బంగ్లా తరఫున ఏకైక గోల్‌ను యాసిన్ అరాఫత్ నమోదు చేశాడు. ఆట ఆరంభంమైన రెండో నిమిషంలో విక్రమ్ బంతిని గోల్ పోస్టులోకి నెట్టి భారత్‌కు బ్రేక్ అందించాడు. అయితే 40వ నిమిషంలో బంగ్లా ఆటగాడు యాసిన్ స్కోర్‌ను సమం చేశాడు. మొదటి అర్ధభాగం అదనపు సమయంలో బహదూర్ రాణా 90 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరే షాట్‌తో గోల్ చేసి జట్టుకు 2–1 ఆధిక్యాన్నిచ్చాడు. రెండో అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.