
దుబాయ్: ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు ఎప్పుడైనా పండగే. పైగా ఫలితం కూడా ఎప్పుడూ మన పక్షమే. 2011 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా గెలిచిన తర్వాత 2012, 2014, 2016 టి20 ప్రపంచకప్‌లతో పాటు 2015 వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇరు జట్లు లీగ్ దశలోనే తలపడ్డాయి. ఆసక్తికరంగా ఎదురు చూసిన ఈ నాలుగు సార్లూ విజయం మననే వరించింది. ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో కూడా జూన్ 16న ఇరు జట్లు పోటీకి సిద్ధమయ్యాయి. అయితే 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌లో మాత్రం దాయాదుల మధ్య పోరు చూసే అవకాశం గ్రూప్ దశలోనైతే లేదు. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన షెడ్యూల్‌లో భారత్, పాకిస్తాన్ రెండు వేర్వేరు గ్రూప్‌లలో ఉన్నాయి. ప్రస్తుత టి20 ర్యాంకింగ్స్‌లో పాక్ తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉండటమే అందుకు కారణం. నాకౌట్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా అనేది తదుపరి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
దక్షిణాఫ్రికాతో ఢీ...
గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌లో అదే రోజు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో పాటు మరో రెండు క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, న్యూజిలాండ్‌లతో పాటు మరో రెండు క్వాలిఫయింగ్ టీమ్‌లు ఉన్నాయి. గ్రూప్ దశను ‘సూపర్–12’గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు ర్యాంకుల్లో టాప్–8గా ఉన్న టీమ్‌లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం శ్రీలంక, బంగ్లాదేశ్ సహా మరో ఎనిమిది జట్లు ప్రధాన పోరుకు ముందు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడి అర్హత సాధించాల్సి ఉంది. నవంబర్ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్ నిర్వహిస్తారు.
.
ఆసీస్‌తో తలపడనున్న భారత మహిళలు
ఫిబ్రవరి–మార్చిలో 2020 మహిళల టి20 ప్రపంచకప్ జరుగుతుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 21న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కొంటుంది. మన గ్రూప్‌లోనే న్యూజిలాండ్, శ్రీలంక కూడా ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు రావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అమెరికా, చిలీ మధ్య జరిగిన 1999 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ మ్యాచ్‌కు అత్యధికంగా 90,185 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టి20 క్రికెట్ తుది పోరు దీనిని అధిగమించవచ్చని ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment