ఫెన్సర్ భవానీ దేవి సంచలనం
► అంతర్జాతీయ ఈవెంట్‌లో స్వర్ణం
► ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు
చెన్నై: భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి చదలవాడ ఆనంద సుందరరామన్ (సీఏ) భవానీ దేవి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర లిఖించింది. ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్‌లో జరిగిన టర్నోయ్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో 23 ఏళ్ల ఈ చెన్నై క్రీడాకారిణి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన సాబెర్ ఈవెంట్ ఫైనల్లో భవాని 15–13తో సారా జేన్ హాంప్సన్ (బ్రిటన్)పై విజయం సాధించింది.
అంతకుముందు జరిగిన సెమీస్‌లో భవాని 15–11తో బ్రిటన్‌కే చెందిన జెస్సికా కోర్బీని ఓడించింది. ‘ఈ టోర్నీలో నేను మూడోసారి పాల్గొన్నాను. గతంలో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ దశ దాటలేదు. ఈసారి మాత్రం స్వర్ణం సాధించాను. ప్రపంచస్థాయి టోర్నీలో నాకిదే తొలి పతకం. గతంలో నేను ఆసియా, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలిచాను’ అని ప్రస్తుతం థలస్సేరి ‘సాయ్’ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్న భవానీ దేవి తెలిపింది.