టెస్టుల్లో గెలుస్తోంది. వన్డేల్లో వణికిస్తోంది. ఐపీఎల్‌తో రాటుదేలింది. కానీ... ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న భారత్.. న్యూజిలాండ్‌పై టి20ల్లో గెలవలేకపోయింది. కివీస్‌తో ఆడిన ఐదుసార్లూ టీమిండియా ఓడింది. ఇందులో రెండు సొంతగడ్డపై ఆడినా... ఫలితం మారలేదు. ఈ నేపథ్యంలో టి20ల్లో నంబర్‌వన్ కివీస్‌పై తొలి విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది కోహ్లి సేన.
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత్ ఇప్పుడు దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఏ జట్టయినా... ఏ ఫార్మాట్‌లోనైనా కోహ్లిసేనదే విజయం. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌తో టి20ల్లో మాత్రం భారత్‌కు సవాల్ ఎదురుగా నిలిచింది. ప్రత్యర్థిపై మన గత రికార్డు ప్రతికూలంగా ఉండగా, తాజా ఫామ్ కూడా కివీస్‌కే అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు (బుధవారం) ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగే తొలి టి20లో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఆఖరి మ్యాచ్ ఆడుతున్న వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రాకు విజయంతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బ్యాటింగ్‌లో మంచి హిట్టర్లున్నారు. ఈ నేపథ్యంలో టి20 సిరీస్ కూడా నువ్వానేనా అన్నట్లు సాగడం ఖాయం.
రోహిత్, కోహ్లి జోరు కొనసాగేనా...
ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లి ఇద్దరు అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. ఇది భారత బ్యాటింగ్‌కు అత్యంత సానుకూలాంశం. శిఖర్ ధావన్ కూడా తోడైతే పరుగుల వరద ఖాయం. ఎందుకంటే తర్వాత వరుసలో మెరుపులు మెరిపించే హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండేలు ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించగల సమర్థులు. వీరిని ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి ధోని అందుబాటులో ఉండనే ఉన్నాడు. బౌలింగ్ విభాగం కూడా యువసత్తాతో పటిష్టంగా ఉంది. అయితే నెహ్రా కు వీడ్కోలు అవకాశం వల్ల బుమ్రా, భువనేశ్వర్‌లలో ఒకరు బెంచ్ కు పరిమితమవుతున్నారు. డెత్ ఓవర్లను నియంత్రించే ఈ జోడి బ్రేక్ అవడం కాస్త ఇబ్బందికరమే అయినా స్పిన్నర్లు అక్షర్ పటేల్, చహల్‌ల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం.
ప్రత్యర్థి బలమూ బ్యాటింగే
న్యూజిలాండ్ కూడా బ్యాటింగ్‌నే నమ్ముకుంది. ఈ జట్టు టి20 ఇన్నింగ్స్‌కు గప్టిలే వెన్నెముక. పవర్ ప్లేను సమర్థంగా వినియోగించుకొని చెలరేగుతాడు. గత 10 మ్యాచ్‌ల్లో అతను ఐదు అర్ధసెంచరీలు చేశాడంటే అతనెంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. వన్డేల్లో ధాటిగా ఆడిన లాథమ్‌ను టి20 తుది జట్టులోనూ కొనసాగించారు. ఒక్క నెహ్రా మినహా మిగతా బౌలర్లందరినీ ఎదుర్కొన్న అనుభవం కివీస్ బ్యాట్స్‌మెన్‌కు ఉంది. దీంతో పాటు ఇటీవలే ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లోనూ భారత్‌కు దీటుగా పరుగులు చేసింది. చివరి మ్యాచ్‌లో కివీస్ ధాటిని చూస్తే కోహ్లి రికార్డుకు బ్రేక్ పడుతుందేమోననే కలవరం కలిగింది. సాన్‌ట్నర్, సౌతీ, భారత సంతతి స్పిన్నర్ ఇష్ సోధిలు కోహ్లి సేన వెన్నువిరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన న్యూజిలాండ్... భారత్ గడ్డపై టి20 సిరీస్ టైటిల్‌తో స్వదేశం చేరాలని పట్టుదలగా ఉంది.
బుమ్రా కూడా నం.1
ఇప్పుడు నంబర్‌వన్ వంతు జస్‌ప్రీత్ బుమ్రాది. తాజా ఐసీసీ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానంలో నిలిచాడు. 729 రేటింగ్ పాయింట్లతో అతను మొదటి ర్యాంకుకు ఎగబాకాడు. టి20 బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లి టాప్ ర్యాంకులోనే కొనసాగుతున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్/బుమ్రా, ఆశిష్ నెహ్రా, చహల్
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, సౌతీ, ఇష్ సోధి.
పిచ్, వాతావరణం
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లు కూడా కొంత ప్రభావం చూపించగలరు. వానతో ముప్పు లేదు.
►రాత్రి 7 గంటలకు స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment