కంప్యూటర్ వద్దన్నాను
ముంబై: ఆధునిక క్రికెట్‌లో కంప్యూటర్ పాత్రను తక్కువగా అంచనా వేయలేం. ఎత్తులకు పైఎత్తులు, ఆటగాళ్ల లోపాలు, మ్యాచ్‌ల విశ్లేషణ ఇలా ఎన్నో అంశాలను దీంతో అంచనా వేయవచ్చు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో కంప్యూటర్ ఉండడం సుతారం ఇష్టముండేది కాదట. తర్వాత్తర్వాత దాని గొప్పతనమేమిటో తెలుసుకున్నాక ఇష్టమేర్పడిందట. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ చిన్నారులను ఉద్దేశించి చెప్పిన పలు విషయాలు అతడి మాటల్లోనే...
కంప్యూటర్ ఏం చేస్తుంది?
నేను అప్పటికే భారత జట్టుకు ఆడి 12-13 ఏళ్ళవుతోంది. 2002-03లో ఓసారి మా డ్రెస్సింగ్ రూమ్‌లోకి కంప్యూటర్‌ను తెచ్చారు. ‘దీంట్లో మొత్తం డాటా ఉంటుంది.. మీకు ఏది కావాల్సి వస్తే దాన్ని చూసుకోవచ్చు’ అని చెప్పారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో కంప్యూటర్ ఏం చేస్తుంది? అని నేను ప్రశ్నించాను. ఎందుకంటే కంప్యూటర్ నాకు బదులుగా బ్యాటింగ్ చేయడానికి వెళ్లదు. లేక జహీర్, హర్భజన్ స్థానంలో వెళ్లి బౌలింగ్ చేయదు కదా. కానీ కొన్ని రోజుల తర్వాత సిస్టం గొప్పదనం నాకు అర్థమైంది. కొన్ని సెకన్లలోనే మనకు కావాల్సిన విలువైన సమాచారాన్ని చూపిస్తుంది. దీంతో ఆ పరికరంపై ఇష్టమేర్పడింది. ఆధునిక సాంకేతికత నా బ్యాటింగ్ తీరును కూడా మెరుగుపరిచింది.
నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది
నా పిల్లలకు నేను చెప్పేది ఒకటే. జీవితంలో మీరేమి కావాలని నిర్ణయించుకుంటారో దాన్ని సాధించాలి. వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నా కూతురు సారా తన తల్లిలా డాక్టర్ కావాలనుకుంటోంది. అర్జున్‌కు క్రికెట్ అంటే పిచ్చి. 20 ఏళ్ల క్రితం ఎంతమంది తల్లిదండ్రులు తమ సంతానం చెఫ్‌గా మారతామంటే అంగీకరించేవారు. కానీ ఇప్పుడు టీవీల్లో పిల్లలు వంట చేసే కార్యక్రమాలు ఎన్నో వస్తున్నాయి. వాటిని చూస్తే అద్భుతంగా ఉంటుంది.
సరైన మార్గంలో వెళ్లండి
జీవితంలో మనం అనుకున్న రీతిలో జీవించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన దారిలోనే వెళ్లండి. అదే కనుక జరిగితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీపై మీకు విశ్వాసముంటే చాలు.. పరిస్థితులు మారిపోతాయి. రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనం ఆగుతాం. కానీ ఎల్లవేళలా అక్కడే ఉండిపోం. అలాగే మీ అవకాశం వచ్చే వరకు వేచి చూడాలి. కానీ మధ్యలో చేతులెత్తేయకూడదు.
‘బి’ అంటే నమ్మకం
నా దృష్టిలో పెద్ద ప్రణాళిక (బిగ్ ప్లాన్) ‘బి’తో ప్రారంభమవుతుంది. ‘బి’ అంటే నమ్మకం (బిలీఫ్). నీ కలలపై నీకు నమ్మకం ఉండాలి. అదెంత వరకు ఆచరణయోగ్యమో నిర్ణయించుకుని తర్వాత దానిపై ప్రేమను ఏర్పరుచుకోవాలి. ‘ఐ’ అంటే (ఇగ్నోరింగ్) ఆకర్షించేవాటికి దూరంగా ఉండడం. ‘జి’ అంటే (గివింగ్ యువర్ బెస్ట్) అన్ని వేళలా ఉత్తమంగా పనిచేయాలి. మిగతా ఫలితం భగవంతుడికి వదిలేయాలి.