రాహుల్ కోలుకుంటున్నాడు: వైద్యులు
స్థానిక లీగ్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రాహుల్ ఘోష్ (20) పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని, అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అతడి మెదడులో గడ్డకట్టిన రక్తం కూడా క్రమంగా తగ్గుతోందని డాక్టర్ బుద్ధదేవ్ సాహా చెప్పారు. ప్రస్తుతం అతడికి ద్రవాహారం మాత్రమే ఇస్తున్నారు. త్వరలోనే ఘనపదార్థాలు కూడా ఇస్తామని సాహా తెలిపారు. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కూడా రాహుల్కు సూప్ ఇచ్చారు.
మరికొన్ని రోజులు అతడిని పరిశీలనలోనే ఉంచుతామని, మూడోసారి కూడా ఎంఆర్ఐ తీయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ క్లబ్ మ్యాచ్ జరుగుతుండగా రాహుల్ ఘోష్్కు తలమీద ఎడమవైపు బంతి తగిలింది. సరిగ్గా బెంగాల్ అండర్-19 జట్టు కెప్టెన్ అంకిత్ కేసరి మరణించిన తర్వాతిరోజే రాహుల్ గాయపడటం గమనార్హం. ఘోష్ చికిత్సకు అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చెప్పింది.