ముందు ఆసియాను గెలుద్దాం... | Injury concerns for India ahead of Asia Cup opener against ... | Sakshi
Sakshi News home page

ముందు ఆసియాను గెలుద్దాం...

Published Wed, Feb 24 2016 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

ముందు ఆసియాను గెలుద్దాం...

ముందు ఆసియాను గెలుద్దాం...

తొలి టి20 ప్రపంచకప్ గెలవడానికి ముందు భారత్ ఆడిన అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఒక్కటే! విశ్వవేదికపై నిలిచేందుకు ఆ అనుభవమే సరిపోయింది. అనంతరం నాలుగు టోర్నీలకు మన జట్టు ఎప్పుడూ సుదీర్ఘ సన్నాహకాలు చేయలేదు. కానీ ఈసారి వరల్డ్ కప్‌కు ముందు పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ధోనిసేనకు దక్కింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆసీస్, లంకలను చిత్తు చేసి... ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. ఇందులో ఘనవిజయం సాధిస్తే ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ముందు ‘ఆసియా’ను గెలవాలి..!
 
* నేడు టోర్నీ తొలి మ్యాచ్
* బంగ్లాదేశ్‌తో భారత్ పోరు
* ఫామ్‌లో టీమిండియా
* ధోని గాయంపై సందిగ్ధత!

 
మిర్పూర్: దాదాపు సంవత్సరం క్రితం బంగ్లాదేశ్‌లో 19 ఏళ్ల కుర్రాడు ముస్తఫిజుర్ భారత్‌ను దెబ్బ తీశాడు. అక్కడి వన్డే సిరీస్ పరాజయం ఏడాదంతా మన జట్టును వెంటాడింది. ఆట ఒక్కటే కాదు... అవసరమైతే రాజీనామా చేస్తానంటూ కెప్టెన్ చెప్పడం మొదలు ఆటగాళ్లంతా వరుస పెట్టి అతనికి మద్దతు పలకడం, మరో వైపు ప్రకటన యుద్ధం... ఇలా చాలా అంశాలు మన జట్టును ఇబ్బంది పెట్టాయి.

ఫార్మాట్‌లో మార్పు జరిగినా ఇప్పుడు ఆ జట్టుపై విజయం సాధించాలనే పట్టుదల మన ఆటగాళ్లందరిలో ఉంది. అదే కసితో భారత్ ఆసియా కప్ తొలి పోరులో బంగ్లాదేశ్‌తో నేడు (బుధవారం) తలపడనుంది. వరుస విజయాలతో భారత్ మంచి ఫామ్‌లో ఉండగా... మరోవైపు సొంతగడ్డపై ఆతిథ్య జట్టు శుభారంభాన్ని ఆశిస్తోంది.
 
మార్పు జరుగుతుందా!
భారత తుది జట్టు, బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు.  వరుసగా ఆరు టి20 మ్యాచ్‌లలో మార్పు లేకుండా ఇదే జట్టు బరిలోకి దిగింది. కోహ్లి అందుబాటులోకి రావడంతో లంకతో గత మ్యాచ్ ఆడిన రహానే పెవిలియన్‌కు పరిమితమవుతాడు. రోహిత్, ధావన్‌లు ఓపెనర్లుగా, ఆ తర్వాత కోహ్లి, రైనా, యువరాజ్‌లతో లైనప్ పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్‌గా పాండ్యా కూడా దూకుడు జోడిస్తాడు. ఇక మ్యాచ్‌కు ముందు జట్టుకు ఏకైక సమస్య కెప్టెన్ ధోని ఇంకా గాయంనుంచి కోలుకోకపోవడమే.

మ్యాచ్ రోజు మాత్రమే అతని ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుంది. ఒక వేళ ధోని పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోతే మాత్రం పార్థివ్ పటేల్ ఆడతాడు. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో ధోని పాల్గొనలేదు. కేవలం సహచరులను గమనించాడు. ఒకవేళ ధోని ఆడకపోతే కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. బౌలింగ్‌లో నెహ్రా, బుమ్రాలు పేస్ బాధ్యతలు పంచుకుంటుండగా... భారత్‌ను పోలిన బంగ్లా పిచ్‌లపై అశ్విన్, జడేజా కీలకం.

గత సిరీస్‌లాగా కాకుండా ఈ సారి అందరికీ అవకాశం ఇస్తామని ధోని అన్నాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే నేగిని తీసుకుంటారా లేదా అనేది చూడాలి. జట్టులో పునరాగమనం తర్వాత యువరాజ్ పేరుకు ఆరు మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు ఎదుర్కొంది 26 బంతులే! కెప్టెన్ చెబుతున్నదాని ప్రకారం బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు లేకపోతే పాత యువరాజ్ తరహా బ్యాటింగ్‌ను పెద్దగా ఆశించలేం.
 
బౌలర్లే కీలకం...
బ్యాటింగ్‌లో భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ అంత బలంగా ఏమీ లేదు. దాంతో ఆ జట్టు తమ బౌలింగ్, ఆల్‌రౌండర్లనే ఎక్కువగా నమ్ముకుంది. ఫార్మాట్ మారినా, వేదిక ఏదైనా బంగ్లా స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అతనితో పాటు సీనియర్లు ముష్ఫికర్, మొర్తజాలను జట్టు నమ్ముకుంది.

గత ఏడాది వన్డేల్లో మనపై చెలరేగిన ముస్తఫిజుర్ ఆ తర్వాత ఆడిన 7 టి20 మ్యాచ్‌లలో కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. ప్రధాన బ్యాట్స్‌మన్ తమీమ్ గాయంతో టోర్నీకి దూరం కావడం జట్టును దెబ్బ తీసింది. వన్డేల్లో కొన్నాళ్లుగా  రాణిస్తున్నా... బంగ్లాదేశ్ టి20ల్లో ఆ స్థాయి దూకుడు కనబర్చలేకపోతోం ది. పవర్‌ప్లేలో  గత రెండేళ్లలో కేవలం 112 స్టైక్‌రేట్‌తోనే పరుగులు చేయడం బంగ్లా బలహీనతను చూపిస్తోంది.
 
జట్లు(అంచనా)
భారత్: ధోని/పార్థివ్, ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా.
బంగ్లాదేశ్: మొర్తజా, సర్కార్, మిథున్, షబ్బీర్, మహ్ముదుల్లా, ముష్ఫికర్, షకీబ్, నూరుల్ హసన్, అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమీన్.

ప్రపంచకప్‌కు ముందు సాధ్యమైనన్ని ఎక్కువ జట్లతో ఆడే అవకాశం రావడం మంచి సన్నాహకం. పరిస్థితులు కూడా దాదాపు ఇదే తరహాలో ఉంటాయి. కాబట్టి ఆసియా కప్ మాకందరికీ మంచి అవకాశం. 20 ఓవర్లలో ఎవరి బాధ్యతలు ఏమిటో మా జట్టులో అందరికీ బాగా తెలుసు. అందరికీ తగిన అనుభవం కూడా ఉంది. మా ప్రణాళికలు కూడా బాగా ఉండటంతో వరుస విజయాలు లభిస్తున్నాయి. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. భారీ సిక్సర్లు కొట్టగలిగే షాట్లు నా వద్ద లేవు. అందుకే ఫోర్ల ద్వారానే ఎక్కువగా పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తా. ముస్తఫిజుర్ గత ఏడాదిగా బాగా ఆడుతున్నాడు. ఈ సారి అతడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడి మ్యాచ్‌లలో మంచు కూడా ప్రభావం చూపిస్తుందని నాకు అనిపిస్తోంది.    
- విరాట్ కోహ్లి
 

ముస్తఫిజుర్ ఎంతో మెరుగయ్యాడు. ఎంత సన్నద్ధమై వచ్చినా ఈ సారి కూడా అతని స్లో కటర్‌లను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టం కావచ్చు. మా టి20 రికార్డు బాగా లేదన్నది వాస్తవం. అయితే మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. సొంతగడ్డపై ఈ టోర్నీలో మేం బాగా ఆడేందుకు అవకాశం ఉంది. ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు మాకు ఇంతకంటే మంచి టోర్నీ దొరకదు.                
- మొర్తజా
 
రా. గం. 7నుంచి స్టార్ స్పోర్ట్స్-1 లో ప్రత్యక్ష ప్రసారం
 
పిచ్, వాతావరణం
ఇటీవల ఇక్కడ జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో బౌలింగ్‌కు అనుకూలమైన పిచ్‌లే ఎక్కువగా వాడారు. తాజాగా ఈ టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో కూడా ఆరంభంలో పేస్‌కు పిచ్ బాగా అనుకూలించింది. అయితే ఆ తర్వా త బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు సాధించగలిగారు. ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో ఉండవచ్చు. చిరుజల్లులకు అవకాశం ఉంది.
 
 2 భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు 2 టి20 మ్యా చ్‌లు జరిగాయి. 2009, 2014 ప్రపంచకప్‌లలో రెం డు సార్లూ భారత్ గెలిచింది.

5 మిర్పూర్ మైదానంలో ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 గెలిచింది. గత టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement