చావో రేవో!
భారత్, బంగ్లాదేశ్ రెండో వన్డే నేడు నిలవాలంటే ధోని సేన గెలవాలి
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలుస్తుందనేది ఇటీవల కాలంలో ఊహించని అంశం. అయినా వాస్తవంలోకి వచ్చేసరికి అదే జరిగింది. తొలి వన్డేలో అనూహ్యంగా ఓడిపోయిన ధోని సేన ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలవాలంటే చివరి రెండు వన్డేల్లోనూ కచ్చితంగా నెగ్గాలి. అటు బంగ్లాదేశ్ జట్టు నేడు జరిగే రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉత్సాహంతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కూ వరుణుడి నుంచి ముప్పుంది.
ఢాకా: తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఆడిన తీరు, విజయంలో పరుగుల తేడా చూసిన తర్వాత రెండో వన్డేలో ఆ జట్టునే ఫేవరెట్‌గా పరిగణిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చూపించిన ‘టైగర్స్’ ఒక్కసారిగా భారత శిబిరాన్ని ఆలోచనలో పడేశారు. నైపుణ్యం పరంగా భారత్ కచ్చితంగా బలమైన జట్టే. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెటర్ల ఫామ్ చూస్తే... నేడు జరిగే రెండో వన్డే (డేనైట్)లో భారత్ గెలవాలంటే సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. రెండు జట్లు కూడా దాదాపుగా మార్పుల్లేకుండా తొలి వన్డే ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.
బ్యాట్స్‌మెన్‌దే భారం: వన్డేల్లో ఇప్పుడు 300 అనేది ఏ జట్టు ఆడినా సాధారణ స్కోరుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్ బాధ్యతగా ఆడాల్సి ఉంది. తొలి వన్డేలో ఓపెనర్లు రోహిత్, ధావన్‌లతో పాటు రైనా ఒక్కడే ఆకట్టుకున్నాడు. రహానే, కోహ్లి, ధోనిల వైఫల్యం జట్టుపై బాగా ప్రభావం చూపించింది. బౌలింగ్‌లో తొలి వన్డేలో పేసర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన పిచ్‌పై భారత సీమర్లు విఫలం కావడం ఆలోచించాల్సిన విషయం. స్లో పిచ్ కాబట్టి అశ్విన్ కీలకం.
అదే జోరులో...: ఓపెనర్లు తమీమ్, సర్కార్‌ల ఫామ్ బంగ్లాదేశ్‌కు గొప్ప వరంగా మారింది. మిడిలార్డర్‌లో ముష్ఫికర్, షకీబ్, షబ్బీర్ నిలకడగా ఆడుతున్నారు. ఇక బౌలింగ్‌లో మరోసారి ఆ జట్టు నలుగురు పేసర్లతో ఆడే అవకాశం ఉంది. ముస్తాఫిజుర్‌తో పాటు తాస్కిన్ తొలి వన్డేలో బౌలింగ్ చేసిన విధానం సహచరుల్లోనూ స్ఫూర్తి నింపింది. భారత్‌కు మరో షాక్ ఇవ్వాలన్న ‘టైగర్స్’ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే, జడేజా, అశ్విన్, ఉమేశ్, భువనేశ్వర్, మోహిత్. బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), తమీమ్, సర్కార్, లిట్టన్, ముష్ఫికర్, షకీబ్, షబ్బీర్, నాసిర్ హొస్సేన్, రూబెల్, ముస్తాఫిజుర్, తాస్కిన్.
పిచ్, వాతావరణం
గత మ్యాచ్ తరహాలోనే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే సోమవారం రిజర్వ్ డే ఉంది.
మ. గం. 2.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
15 సొంతగడ్డపై బంగ్లాదేశ్ వరుసగా తొమ్మిది వన్డేల్లో గెలిచింది. గతంలో ఎన్నడూ బంగ్లా జట్టు ఈ ఘనత సాధించలేదు.9