సైనా సెహ్వాల్
సాక్షి, న్యూఢిల్లీ : కామన్‌వెల్త్ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్ సింగ్‌ను అనుమతించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటానని ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆమె భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతాకు లేఖ రాశారు. తన తండ్రికి అక్రిడేషన్ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖకు స్పందించిన ఐఓఏ సైనా తండ్రిని కామన్‌వెల్త్ గేమ్స్‌కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. అతను సైనా మ్యాచ్‌లను చూడవచ్చని స్పష్టం చేసింది.
ఇక అంతకు ముందు సైనా కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. తన తండ్రి మద్దతు లేకుండా తాను ఆడలేనని, అందుకే ఆయనను అన్ని మ్యాచ్‌లకు తీసుకెళ్తుంటానన్నారు. తొలుత టీమ్ అధికారిగా తన తండ్రిని ధ్రువీకరించడంతో ఆయన ఖర్చులన్నీ భరించి తీసుకొచ్చానని, తీరా ఇక్కడికి వచ్చాక.. తన తండ్రి పేరును టీమ్ అధికారిక జాబితా నుంచి తొలగించారని సైనా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో రేపటి (బుధవారం) నుంచి కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు గణనీయమైన పతకాలు సాధిస్తారని భావిస్తున్న తరుణంలో సైనాకు ఇలా చేదు అనుభవం ఎదురుకావడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment