నేడే చూడండి... మహా సంగ్రామం
♦ నేడు హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్
♦ ముంబై ఇండియన్స్‌తో రైజింగ్ పుణే ఢీ
♦ మూడో టైటిల్‌పై రోహిత్ సేన దృష్టి
♦ తొలి ట్రోఫీపై స్మిత్ బృందం గురి
తొమ్మిదేళ్లలో రెండు సార్లు విజేతగా నిలిచి, మరోసారి ఫైనల్లో ఓడిన జట్టు ఒకవైపు... లీగ్‌లోకి అడుగు పెట్టిన రెండో ఏడాదే టైటిల్‌పై గురి పెట్టిన జట్టు మరోవైపు... అభిమానుల అంచనాలకు తగినట్లుగా రాణించి అగ్రస్థానంలో నిలిచిన టీమ్ ఒకవైపు... ఏడాది క్రితం పరాభవం నుంచి కోలుకొని, ఆపై అనూహ్యంగా దూసుకుపోయి పోటాపోటీగా రెండో స్థానంలో నిలిచిన టీమ్ మరోవైపు... ఐపీఎల్–10లో నిలకడగా రాణించిన రెండు జట్ల మ«ధ్యే అంతిమ పోరుకు రంగం సిద్ధమైంది.
ఈ సీజన్‌లో రెండు మరాఠా జట్ల మధ్య పోరులో 3–0తో పుణేదే పైచేయి అయినా... ‘ఫైనల్ పంచ్’తో ఆ మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. తన సారథ్యంలో మరో లీగ్ టైటిల్‌ను సాధించాలని రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతుండగా... కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్ స్మిత్ పట్టుదలగా ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు జరగబోయే ఈ మహా సంగ్రామంలో అంతిమ విజేత ఎవరో?
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ వినోదానికి రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2017 ఫైనల్లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచినా, తొలి క్వాలిఫయర్‌లో ముంబైనే చిత్తు చేసి పుణే ఫైనల్లోకి అడుగు పెట్టగా... టేబుల్ టాపర్ ముంబై రెండో క్వాలిఫయర్‌లో కోల్‌కతాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉండటంతో పాటు తాజా ప్రదర్శన అనంతరం మానసికంగా కూడా ఇరు జట్లు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా మూడు నాకౌట్ మ్యాచ్‌ల తరహాలో కాకుండా ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగాలని అంతా కోరుకుంటున్నారు.
ఆ ఇద్దరు...
ఎమ్మెస్ ధోనిని పుణే యాజమాన్యం కెప్టెన్‌గా తొలగించిందేమో గానీ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పించలేకపోయింది! ఈ సీజన్‌లో పుణే అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్‌లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్‌మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణేకు తిరుగుండదు.
వీరిద్దరు బ్యాటింగ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. తొలి క్వాలిఫయర్‌లో ధోని బ్యాటింగ్ అతని సత్తాను మళ్లీ చూపించగా, స్మిత్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఓపెనింగ్‌కు తోడు రహానే కూడా వేగంగా ఆడటం అవసరం. ఈ సీజన్‌లో మధ్య ఓవర్లలో (7–15) పుణే బ్యాటింగ్ వేగం మరీ మందకొడిగా ఉంది. దీనిని సరిదిద్దాలంటే మిడిలార్డర్ రాణించాల్సి ఉంటుంది.
గత మ్యాచ్‌లోనూ స్టోక్స్ అందుబాటులో లేకపోయినా గట్టెక్కిన పుణే, ఈ సారి ముంబైపై మరింత పదునైన వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. గత మ్యాచ్ నెగ్గిన జట్టులో పుణే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. విదేశీ ఆటగాళ్లలో క్రిస్టియాన్ చివరి ఓవర్లలో కీలకం కానున్నాడు. లీగ్ దశలో తమ చివరి పది మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి సూపర్ ఫామ్ కనబర్చిన పుణే, ఆ తర్వాత క్వాలిఫయర్‌లో కూడా చెలరేగింది. తమ టైటిల్ కలను నిజం చేసే మరో విజయం కోసం ఆ జట్టు ఎంతగా శ్రమిస్తుందో చూడాలి.
అంతా బాగుంది...
పవర్‌ప్లేలో ప్రత్యర్థికి అతి తక్కువ పరుగులు ఇచ్చి బ్యాటింగ్ సమయంలో మాత్రం చివరి 5 ఓవర్లలో చితక్కొట్టడంలో ఈ సీజన్‌లో ముంబై విజయమంత్రం దాగి ఉంది. చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ 43 ఫోర్లు బాదితే, సిక్సర్లే 45 కొట్టడం విశేషం. ఇక బౌలింగ్‌లో ముఖ్యంగా మెక్లీనగన్, బుమ్రా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు రాణించడంతో మలింగ వైఫల్యం పెద్దగా కనపడలేదు. తన ఐపీఎల్ కెరీర్‌లో మలింగ ఇంతగా ఎప్పుడూ విఫలం కాలేదు. మెక్లీనగన్ కోలుకుంటే అతడిని తుది జట్టులోకి తీసుకుంటారా లేక జాన్సన్‌ను కొనసాగిస్తారా చూడాలి. గత మ్యాచ్‌లో చెలరేగిన కరణ్ శర్మకు ఉప్పల్ మైదానంలో అందరికంటే ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది.
బ్యాటింగ్‌లో కూడా ముంబైకి తిరుగులేదు. సిమన్స్ విఫలమవుతున్నా, ఫైనల్ పోరులో మాత్రం జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. రోహిత్ ఫామ్‌లోకి రాగా.. రాయుడు, పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌ల మెరుపులు ముంబైకి భారీ స్కోరు అందించగలవు. అన్నింటికీ మించి వీరిలో తొమ్మిది మందికి ఐపీఎల్ ఫైనల్‌లో ఆడి ఒత్తిడిని తట్టుకున్న అనుభవం ఉండటం కూడా ముంబైకి అదనపు బలంగా మారనుంది. పదేళ్ల ఐపీఎల్‌లో అటు ఆటతో పాటు ఇటు భారీ బలగంతో కూడా అందరినీ ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్, మిగతా జట్లను వెనక్కి తోస్తూ ముచ్చటగా మూడో టైటిల్ గెలిస్తే అది సరైన ముగింపు అవుతుంది.
♦ గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేదు. ఫైనల్ అంటే ఫైనలే. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే విజేతగా నిలుస్తారు.
–స్మిత్
♦ పుణేపై మాకు రికార్డు బాగా లేదు. అయితే ఏ ఒక్కరి పైనో ఆధారపడకుండా సమష్టిగా ఆడి ఫైనల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంది. –రోహిత్ శర్మ
రాత్రి గం. 8 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
పిచ్, వాతావరణం
సాధారణ టి20 తరహా బ్యాటింగ్ పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఈ సీజన్‌లో అటు పెద్ద స్కోర్లు, ఇటు తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. ఆటగాళ్ల ప్రతిభ మినహా మ్యాచ్ ఫలితాలపై అసాధారణంగా పిచ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం నగరంలో తీవ్రమైన ఎండ. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం లేదు. ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్‌లలో ఒకసారి మాత్రమే కొద్దిసేపు వాన అడ్డు పడినా, ఓవర్ల కోత లేకుండా పూర్తి మ్యాచ్ సాగింది.
⇔ ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. గతంలో 2010లో చెన్నై చేతిలో ఓడిన జట్టు... 2013, 2015లలో చెన్నైనే ఓడించి విజేతగా నిలిచింది.
⇔ ధోని ఐపీఎల్ ఫైనల్ ఆడటం ఇది ఏడో సారి. రెండు సార్లు (2010, 2011) టైటిల్ గెలిచిన జట్టుకు అతను కెప్టెన్.
⇔ ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్న అతి పిన్న వయస్కుడు వాషింగ్టన్ సుందర్ (17 ఏళ్ల 228 రోజులు)
తుది జట్ల వివరాలు (అంచనా)
రైజింగ్ పుణే సూపర్ జెయింట్: స్మిత్ (కెప్టెన్), రహానే, త్రిపాఠి, మనోజ్ తివారి, ధోని, క్రిస్టియాన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గూసన్, జంపా, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్ పటేల్, అంబటి రాయుడు, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, జాన్సన్/మెక్లీనగన్, కరణ్ శర్మ, బుమ్రా, మలింగ.