
మొహాలీ: సొంత మైదానంలో కింగ్స్ పంజాబ్ రెచ్చిపోయింది. సామ్ కరన్ హ్యాట్రిక్ షోతోపాటు అన్ని రంగాల్లో ఆకట్టుకున్న అశ్విన్ సేన ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమష్టిగా ఓడించింది. ఐపీఎల్-12లో భాగంగా స్థానిక ఐఎస్ బింద్రా మైదానంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 152 పరుగులకే కుప్పకూలి ఓటమి చవిచూసింది. ఛేదనలో పృథ్వీ షా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ధావన్(30), అయ్యర్(28), ఇన్‌గ్రామ్(38), పంత్(39)లు రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. గెలుపు దగ్గరి వరకు వచ్చిన ఢిల్లీని చివర్లో పంజాబ్ బౌలర్లు అడ్డుకున్నారు. చివర్లో వరుసగా వికెట్లు తీసి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ బౌలర్లలో కరన్ నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అశ్విన్, షమీలు తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆదిలోనే కేఎల్ రాహుల్(15) వికెట్‌ను నష్టపోయింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన రాహుల్.. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికి సామ్ కరన్(20) కూడా నిష్క్రమించడంతో కింగ్స్ పంజాబ్ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో 22 పరుగుల వ్యవధిలో మయాంక్ అగర్వాల్(6) కూడా ఔట్ కావడంతో కింగ్స్ మరింత కష్టాల్లో పడింది. ఆ తరుణంలో సర్ఫరాజ్ ఖాన్(39)-డేవిడ్ మిల్లర్(43)ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 62 పరుగులు భాగస్వామ్యం చేయడంతో కింగ్స్ తేరుకుంది. మన్‌దీప్ సింగ్(29 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ మూడు వికెట్లు సాధించగా,లామ్‌చెన్, రబడాలు తలో రెండు వికెట్లు తీశారు.