ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ వాయిదా ఇక లాంఛనమే. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షల్ని విధించడంతో ఐపీఎల్‌ను వాయిదా వేయడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖంగా ఉంది. కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఫ్రాంచైజీలు కోరడంతో అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఇదే విషయమై ఒక బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తీసుకుంటే ఐపీఎల్‌ను వాయిదా వేయడమే కరెక్టని అభిప్రాయపడ్డాడు. అంతేగాక ఐపీఎల్ సీజన్‌కు విదేశీ ఆటగాళ్లు కూడా ఏప్రిల్ 14వ తేదీ వరకు అందుబాటులో ఉండరు. ఇదే విషయమై ఐపీఎల్ ప్రాంచైజీలు కూడా లీగ్‌ను రెండు వారాలు వాయిదా వేయాలని కోరాయన్నారు. దీంతో ఏప్రిల్15 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే శనివారం ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ సీజన్.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.(ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం)
కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 15 వరకు విదేశీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో విదేశీ క్రికెటర్లు అప్పటివరకూ ఐపీఎల్ ఆడటానికి భారత్‌కు వచ్చే చాన్స్ లేదు. ఇప్పటికే ఐపీఎల్-13 సీజన్‌ను రద్దు చేయాలంటూ పలువురు కోర్టుల్ని ఆశ్రయించగా, ప్రేక్షకులు రాకుండా మ్యాచ్‌లు నిర్వహించాలనే కేంద్ర నిర్ణయం మరో కొత్త సమస్యను తీసుకొచ్చింది. మరొకవైపు పలు రాష్టాలు కూడా ఐపీఎల్ నిర్వహించడానికి సిద్ధంగా లేవు. మహరాష్ట్ర, హరియాణా, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే ఐపీఎల్‌కు సానుకూలంగా లేని పక్షంలో ఇక వాయిదానే బీసీసీఐ సమస్యకు పరిష్కారంగా కనబడుతోంది. (భయంతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు)
Comments
Please login to add a commentAdd a comment