ముంబై: ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 నిర్వహణకు సంబంధించి ఒక్కసారిగా అనూహ్య రీతిలో సందేహాలు మొదలయ్యాయి. ముంబైలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజా పరిస్థితుల్లో లీగ్ నిర్వహణ కష్టమని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తమ రాష్ట్రంలో అధికారికంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29న ముంబైలోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ మొదలు కావాల్సి ఉంది.
‘కరోనా సమస్యను ఎదుర్కొనేందుకు ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర కేబినెట్ చర్చించింది. ఇందులో ఐపీఎల్ గురించి కూడా మాట్లాడాం. ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి ఐపీఎల్‌ను వాయిదా వేయడం లేదా మ్యాచ్‌లు జరిగినా ప్రేక్షకులను అనుమతించకుండా టీవీలకే పరిమితం చేయడం మరొకటి’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. దీనిపై తుది నిర్ణయం ఒకటి, రెండు రోజుల్లో వెలువడవచ్చు. మరో వైపు మహారాష్ట్ర తరహాలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment