
ఐఎస్ఎల్ సంబరాలు ప్రారంభం..
గువాహటి: భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), ప్రొ కబడ్డీ లీగ్ అనంతరం క్రీడాభిమానులను అలరించే లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్). ఎప్పుడెప్పుడా అని ఫుట్ బాల్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐఎస్ఎస్ సందడి నేడు మొదలైంది. అసోం రాజధాని గువాహటిలో శనివారం సాయంత్రం ఐఎస్ఎల్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశంలో ఫుట్‌బాల్ క్రీడకు ఆదరణ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఐఎస్‌ఎల్ మెగా ఈవెంట్లో ఇది మూడో సీజన్. మైదానం మెరుపులతో కళకళలాడిపోయింది. బాణాసంచాలు, లేజర్ షో.. ఇవన్నీ కలగలిపి మిరుమిట్లు గొలిపే కాంతులతో ఐఎస్ఎల్ మరోసారి ఘనంగా స్వాగతం పలికింది.
ఆరంభవేడుకలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఫుట్ బాల్ అభిమానులలో జోష్ పెంచాయి. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా తలా 14 మ్యాచ్‌లను ఆడనున్నాయి. 11 వారాల పాటు సాగే ఈ లీగ్ ఫుట్‌బాల్ ప్రేమికులను అలరించనుంది. చెన్నైయిన్ ఎఫ్‌సీ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతోంది. ఐఎస్ఎల్-3లో ప్రారంభ మ్యాచ్ నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ జట్ల మధ్య జరగనుంది. గత రెండు సీజన్లలోనూ ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరిగింది. సచిన్ టెండూల్కర్‌తో పాటు ప్రముఖ తెలుగు నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కేరళ బ్లాస్టర్స్ జట్టులో భాగస్వామ్యులుగా ఉన్న విషయం తెలిసిందే.