రోమ్ : ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇటలీలో కూడా ఈ ప్రభావం భారీగానే ఉంది. ఒక దశలో అత్యధిక కరోనా మరణాలు కూడా చోటుచేసుకున్న దేశంగా ఇటలీ నిలిచింది. అయితే ఆ తర్వాత అక్కడ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ టీమ్స్ మే నెల మూడో వారం నుంచి తమ శిక్షణ ప్రారంభించేందుకు ఇటలీ ప్రధాని గియుసేప్ కంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రఖ్యాత సెరీ ‘ఎ’ ఫుట్‌బాల్ లీగ్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కరోనా ప్రస్తుత పరిణామాలు, లాక్‌డౌన్ సులభతరం చేసే చర్యలపై ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే క్రీడాకారులు వ్యక్తిగత శిక్షణను మే 4 నుంచి ప్రారంభించవచ్చని తెలపారు. అయితే ఆటగాళ్లు భౌతిక దూరం నిబంధన పాటించాలని.. జట్లు తమ శిక్షణను మే 18 నుంచి మొదలు పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇటాలియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఇందుకోసం వైద్యపరమైన ప్రొటోకాల్ రూపొందించిందని తెలిపారు.
‘ఈ శిక్షణ సురక్షితంగా సాగేలా క్రీడాశాఖ మంత్రి.. శాస్త్రవేత్తలు, క్రీడా అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకుసాగనున్నారు. దీని తర్వాత మనం నిలిపివేసిన చాంపియన్‌షిప్స్ కొనసాగించడం సురక్షితమైనదనే హామీ లభిస్తే.. మేము వాటిపై ఆలోచన చేస్తాం. మా ఆటగాళ్ల భద్రత మాకు చాలా ముఖ్యం.. వారిని మేము ప్రమాదంలోకి నెట్టలేం. నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. చాలా మంది ఇటాలియన్స్ లాగానే నేనుకూడా చాంపియన్‌షిప్‌కు అంతరాయం కలగడాన్ని వింతగా చూశాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని వీర అభిమానులు సైతం అర్థం చేసుకున్నారు. శిక్షణ ప్రారంభించే ముందు ప్రతి క్లబ్ ఆటగాళ్లను, సాంకేతిక సిబ్బందిని, వైద్యులను, ఫిజియోథెరపిస్ట్‌లను పరీక్షిస్తారు. ఆ తర్వాత వారిని వేసవి తరహా ట్రైనింగ్ క్యాంప్‌లో ఉంచుతారు’ అని గియుసేప్ తెలిపారు. కాగా, యూరప్‌లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న తొలి దేశంగా ఇటలీ నిలిచిన సంగతి తెలిసింది. దీంతో ప్రభుత్వం ప్రఖ్యాత సెరీ ‘ఎ’ లీగ్‌ను మార్చి 9న నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment