అశ్విన్ జపం చేస్తే ఎలా?: గంగూలీ
రాజ్కోట్: ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న రాజ్కోట్ అచ్చమైన ఫ్లాట్ వికెట్ అని, ఆ తరహా పిచ్లపై స్పిన్నర్లే కంటే పేసర్లతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్లపై స్పిన్నర్లు వికెట్లు తీయడం కష్ట సాధ్యమన్నాడు. మంచి పిచ్ లపై భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేటప్పుడు ముగ్గురు పేసర్లు ఫార్ములాను ఉపయోగించుకోవడమే సరైన పద్ధతిన్నాడు. తొలి టెస్టులో మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్లకు తోడు ఇషాంత్ శర్మ కూడా ఉంటే బాగుండేదన్నాడు. అప్పుడే భారత్ మరింత బలంగా ఉండేదని గంగూలీ పేర్కొన్నాడు.
'ప్రతీసారి అశ్విన్ జపం చేస్తే ఎలా?, బ్యాటింగ్ అనుకూలించే పిచ్లపై స్పిన్నర్లపై భారం తగదు. అశ్విన్, జడేజాలు నిలకడగా ఐదేసి వికెట్లు తీయాలని భావించడం ఎంతమాత్రం సరైన ఆలోచన కాదు. రాజ్కోట్ తరహా పిచ్ల్లో ఫాస్ట్ బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్ విదేశీ పిచ్లపై ఎలా ఆడాలనేది నేర్పుతుంది. 2013లో ఆసీస్తో, 2015లో దక్షిణాఫ్రికాతో మనం స్వదేశంలో ఆడిన పిచ్లు అచ్చమైన స్పిన్ పిచ్లు. ఈ పిచ్ అలా కాదు. ఇది ఫ్లాట్ వికెట్. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. అటువంటప్పుడు అశ్విన్ ఐదు వికెట్లు తీయాలని ఆశించడం భావ్యం కాదు. అది సాధ్యం కూడా కాదు. అందులోనూ ప్రత్యర్థి ఇంగ్లండ్ మంచి బ్యాటింగ్ ఆర్డర్ కల్గిన జట్టు. ఫ్లాట్ వికెట్పై స్పిన్నర్లు తరచు విజయవంతం కాలేరు 'అని గంగూలీ పేర్కొన్నాడు.
ఆట ఆరంభమైన తొలి రోజు నుంచి పిచ్లు స్పిన్కు అనుకూలిస్తే ఎటువంటి లాభం ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. మూడు రోజులో టెస్టు మ్యాచ్ను గెలవాల్సిన అవసరం లేదని, ఐదు రోజులు జరిగే గెలిస్తేనే మజా ఉంటుందని గంగూలీ తెలిపాడు.