జవాన్లే హీరోలు: కోహ్లి
న్యూఢిల్లీ: స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ప్రచారకర్తగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో అధికారులు అతనికి క్యాప్‌ను బహూకరించారు. స్వల్ప స్థాయిలో క్రికెటర్లు దేశానికి సేవ చేస్తున్నా... నిజమైన హీరోలు మాత్రం బీఎస్‌ఎఫ్ జవాన్లేనని ప్రశంసలు కురిపించాడు.
వాళ్ల వల్లే దేశంలో తాము సురక్షితంగా ఉండగలుగుతున్నామని కితాబిచ్చాడు. ‘దేశ సరిహద్దుల్లో ఉన్న అన్ని బీఎస్‌ఎఫ్ యూనిట్లను సందర్శించే అవకాశం నాకు దక్కింది. ఇక జవాన్లను నేరుగా కలుస్తా. సుదీర్ఘ కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశానికి సేవ ఎలా చేయగలుగుతున్నారో తెలుసుకుంటా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవడంలో తాను విజయవంతమయ్యానని చెప్పిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ ప్రస్తుతం చాలా పరిణతితో వ్యవహరిస్తున్నానని తెలిపాడు.