ఇకపై భార్యలకూ అనుమతి లేదు!
వచ్చే సిరీస్ నుంచి అమలు చేయనున్న బీసీసీఐ
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఘోర వైఫల్యం భారత జట్టును దెబ్బ తీసింది. అతని ప్రదర్శనతో నేరుగా సంబంధం ఉన్నా, లేకపోయినా... గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మ వెంట ఉండటమే కారణమంటూ తీవ్ర చర్చ జరిగింది. అనుష్కను బీసీసీఐ అధికారికంగా అనుమతించడంపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని బోర్డు భావిస్తోంది. గర్ల్ ఫ్రెండ్స్ సంగతి సరే... కనీసం ఆటగాళ్ల భార్యలను కూడా విదేశీ పర్యటనలకు అనుమతించరాదని తాజాగా ప్రతిపాదించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కోహ్లి గర్ల్‌ఫ్రెండ్ కాకుండా... పుజారా, విజయ్, అశ్విన్, బిన్నీ, గంభీర్ తమ భార్యలతో కలిసి వెళ్లారు. ‘ఇంగ్లండ్ పర్యటన అందరి కళ్లు తెరిపించింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంగ్లండ్‌లో క్రికెటర్లు ఆటపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ వారి భార్యల కారణంగా ఏకాగ్రత చెదిరింది. ఆటగాడు జిమ్‌కో, ప్రాక్టీస్‌కో వెళదామని భావించగానే...సిటీ చూసేందుకో, షాపింగ్ కోసమే వారి భాగస్వాములు తీసుకెళ్లారు.
అందుకే దీనికి కళ్లెం వేయాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గతంలో క్రికెటర్ తన భార్యను తీసుకెళ్లాలంటే బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరో వైపు సిరీస్ ఆసాంతం కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తరహాలో కొన్ని రోజుల పరిమిత సమయం పాటు భార్యలను అనుమతించే ప్రతిపాదన గురించి కూడా బోర్డు ఆలోచిస్తోంది.