
రాజ్‌కోట్: భారత జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో రవీంద్ర జడేజా దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో శనివారం ప్రారంభమైన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో తొలి రోజే జడేజా అజేయ సెంచరీ సాధించాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా (150 బ్యాటింగ్, 18 ఫోర్లు, 2 సిక్సర్లు)తోపాటు షెల్డన్ జాక్సన్ (181; 22 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఆరంభంలో జట్టు స్కోరు 59 పరుగులకే కీలకమైన రాబిన్ ఉతప్ప (37), చతేశ్వర్ పుజారా (13), పర్మర్ (8) వికెట్లను కోల్పోయిన సౌరాష్ట్రను జాక్సన్, జడేజా ఆదుకున్నారు. ఇద్దరు క్రీజులో నిలదొక్కుకున్నాక యథేచ్ఛగా బ్యాట్లను ఝుళిపించారు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 281 పరుగులు జోడించిన అనంతరం జాక్సన్ నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన స్నేల్ పటేల్ (31 బ్యాటింగ్)తో కలిసిన జడేజా అబేధ్యమైన ఐదో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. రసూల్, వసీమ్ రజా, దయాళ్, ముదాసిర్ తలా ఒక వికెట్ తీశారు.
తొలిరోజు అశ్విన్ విఫలం
త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన భారత అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి రోజు 24 ఓవర్లు వేసి ఒక వికెటే తీయగలిగాడు. ఆట నిలిచే సమయానికి త్రిపుర 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. స్మిత్ పటేల్ (99), యశ్‌పాల్ సింగ్ (96) సెంచరీలను చేజార్చుకున్నారు. కౌషిక్ ఘోష్ సెంచరీ: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఓపెన ర్ కౌషిక్ ఘోష్ (114; 11 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రామన్ (94), ఛటర్జీ (58 బ్యాటింగ్) రాణించడంతో బెంగాల్ 2 వికెట్లకు 283 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment