నాకౌట్‌కు అర్హత సాధించిన అనంతరం తమ దేశ అభిమానులతో ఆనందాన్ని పంచుకుం టున్న జపాన్ ఆటగాళ్లు
డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే పరిస్థితి జపాన్‌ది! గెలిచినా ముందుకెళ్లలేని స్థితి పోలాండ్‌ది! ఈ లెక్కల మధ్య... ఆసియా జట్టు అనూహ్యంగా ఓడింది. అయినా తదుపరి రౌండ్ చేరింది. ఊహించని గణాంకాలు తెరపైకి వచ్చి జపాన్‌ను ఒడ్డున పడేశాయి.
వొల్గొగ్రాడ్: ప్రస్తుత ప్రపంచ కప్‌లో నాకౌట్ చేరిన ఏకైక ఆసియా జట్టుగా జపాన్ నిలిచింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పోలాండ్ చేతితో 0–1తో ఓడినా ఆ జట్టుకు కొంత అదృష్టం తోడై ముందుకెళ్లింది. పోలాండ్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెడ్నారెక్ (59వనిమిషం) గోల్ చేశాడు.
ఆధిపత్యం అటు ఇటు...
పెద్దగా మెరుపుల్లేకుండానే సాగిన ఆటలో మొదటి భాగంలో పోలాండ్, రెండో భాగంలో జపాన్ ఆధి పత్యం కనబర్చాయి. యొషినొరి మ్యుటో దాడితో ప్రారంభంలో ఆసియా జట్టుకే గోల్ అవకాశం దక్కింది. కీపర్ లుకాజ్ ఫాబియాన్‌స్కీ అడ్డుకోవడంతో స్కోరు కాలేదు. అయితే, ప్రత్యర్థి డిఫెన్స్ బలంగా ఉండటంతో పైచేయి చిక్కలేదు. ఓ దశలో పోలాండ్‌కు కమిల్ గ్రోస్కీ హెడర్ షాట్‌తో గోల్ తెచ్చినంత పని చేశాడు. కానీ, కీపర్ ఎజ్జి కవాషిమా చురుగ్గా స్పందించి నిలువరించాడు. జపాన్ మొదటి భాగంలోనే ఆరుగురు ఆటగాళ్లను సబ్‌స్టిట్యూట్‌లుగా దింపి నా ఫలితం పొందలేకపోయింది. ఇటు పోలాండ్ కెప్టెన్ లెవాన్‌డొస్కీ ప్రత్యర్థి శిబిరంపై కనీసం షాట్ కూడా కొట్టలేకపోవడంతో స్కోరేమీ లేకుండానే తొలి 45 నిమిషాల సమయం ముగిసింది.
ఏకైక గోల్...
రెండో భాగమూ పోటాపోటీగానే ప్రారంభమైంది. అయితే, రఫల్ కుర్జావా కొట్టిన ఫ్రీ కిక్‌ను అద్భుత రీతిలో అందుకున్న బెడ్నారెక్ గోల్ పోస్ట్‌లోకి పంపడంతో ఆధిక్యం దక్కింది. సరిగ్గా ఈ సమయానికి అటువైపు మ్యాచ్‌లో సెనగల్‌పై కొలంబియా గోల్ చేయకపోవడంతో గ్రూప్‌లో జపాన్ మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఒక్కసారిగా దాడులు పెంచింది. అయితే, చివర్లో లెక్క అర్థం చేసుకుని ఎలాంటి ప్రయోగాలకు పోకుండా సమయాన్ని గడిపేసి ముగించింది. మ్యాచ్ మొదటి భాగంలో బంతి 56 శాతం పోలాండ్ ఆధీనంలోనే ఉంది. మొత్తం మీద చూస్తే జపానే (54 శాతం) బంతిని ఎక్కువ నియంత్రణలో ఉంచుకుంది.
ఎల్లో కార్డులే కారణం
వరల్డ్ కప్ చరిత్రలో ఇదో అరుదైన ఘటన. తొలి సారి ఒక జట్టు ‘ఫెయిర్ ప్లే’ ద్వారా నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘హెచ్’లో గురువారం అన్ని మ్యాచ్‌లు ముగిశాక కొలంబియా 6 పాయింట్లతో అగ్రస్థానంతో ముందంజ వేసింది. జపాన్, సెనెగల్ చెరో 4 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఇరు జట్లు ఒక మ్యాచ్ గెలిచి, ఒకటి ఓడి, మరోటి డ్రా చేసుకున్నాయి. చేసిన గోల్స్, ఇచ్చిన గోల్స్ కూడా సమానంగా (4) ఉన్నా యి. దాంతో ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం మైదానంలో ఆటతీరును బట్టి ఫెయిర్ ప్లే ప్రకారం ఇరు జట్లలో ఒకరిని ఎంపిక చేశారు.
గ్రూప్ దశలో జపాన్ 4 ఎల్లో కార్డులకు గురి కాగా (–4 పాయింట్లు), సెనెగల్ ఆటగాళ్లు 6 ఎల్లో కార్డులు (–6 పాయింట్లు) అందుకున్నారు. ఫలితంగా జపాన్‌దే పైచేయి అయింది. అయితే పేరుకు ‘ఫెయిర్ ప్లే’ అయినా పోలాండ్‌తో మ్యాచ్‌లో జపాన్ క్రీడా స్ఫూర్తిపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. స్కోరులో వెనుకబడిన తర్వాత కూడా ఆ జట్టు పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శించింది. మ్యాచ్ తర్వాత ఎల్లో కార్డుల లెక్క ముందుకు వస్తుందని గుర్తించిన జపాన్ చివరి పది నిమిషాల్లో అతి జాగ్రత్తగా, అసలు ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా ఆడింది. అటు గోల్స్ సంఖ్య పెరిగినా ఫలితం లేదని భావించి పోలాండ్ కూడా దాడులు చేయకపోవడంతో ఆఖర్లో ఆట ట్రైనింగ్ సెషన్‌లా సాగింది.
వరల్డ్ కప్ ఫుట్‌బాల్‌లో నేడు విశ్రాంతి దినం
Comments
Please login to add a commentAdd a comment