కాన్పూర్:న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయంలో ఒక రనౌట్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ టాపార్డర్ ఆటగాడు టామ్ లాథమ్ మంచి జోరు మీద ఉన్న సమయంలో అతన్ని బూమ్రా రనౌట్ చేసి మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పేశాడు. 48 ఓవర్ లో బూమ్రా వేసిన ఐదో బంతిని యార్కర్ గా సంధించాడు. దాంతో క్రీజ్ లో ఉన్న గ్రాండ్ హోమ్ బంతిని హిట్ చేయడంలో విఫలమయ్యాడు. కాగా, అవతలి ఎండ్ లో ఉన్న టామ్ లాథమ్ కు స్ట్రైకింగ్ కు ఇచ్చే ఉద్దేశంలో పరుగు కోసం గ్రాండ్ హోమ్ యత్నం చేశాడు. సహచర ఆటగాడు గ్రాండ్ హోమ్ ఇచ్చిన కాల్ తో లాథమ్ పరుగు తీసేందుకు పిచ్ సగానికి పైగా దాటి వెళ్లిపోయాడు.
అదే సమయంలో వికెట్ కీపర్ ఎంఎస్ ధోని చేతులో ఉన్న బంతిని వేగంగా బౌలర్ ఎండ్ లో ఉన్న బూమ్రా వైపు విసిరాడు. దాన్ని చక్కగా ఒడిసి పట్టుకున్న బూమ్రా.. అంతే వేగంతో వికెట్లను గిరటేశాడు. దాంతో లాథమ్ భారంగా పెవిలియన్ కు చేరాల్సివచ్చింది. అయితే బూమ్రా చేసిన చర్యకు మాత్రం ధోని విపరీతంగా నవ్వుకున్నాడు. వికెట్లదగ్గరికి వెళ్లి బెయిల్స్ ను కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, బూమ్రా బంతిని అందుకున్న చోట నుంచి రనౌట్ చేయడంపై ధోని పగలబడి మరీ నవ్వుకున్నాడు. ఒకవేళ ఆ బంతి వికెట్లకు తాకకుండా ఉంటే ఏమయ్యేదనే అర్థం వచ్చేలా ధోని నవ్వుతూ ప్రశ్నించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అతని అవుటైన తరువాత ఊపిరి పీల్చుకున్న భారత జట్టు.. కడవరకూ పోరాటం సాగించి ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకవేళ లాథమ్ ను రనౌట్ చేయడంలో విఫలమైతే మాత్రం సిరీస్ లో ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాథమ్(65)హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment