ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లలో టీమిండియా సూపర్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా ఒకడు. తనదైన ప్రత్యేక బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే ఈ పేస్ గుర్రం ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో శ్రీలంక పర్యటనకు గైర్హాజరైన రైటార్మ్ పేసర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలవులను పొడిగించింది. ఫాస్ట్ బౌలర్లు గాయాల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ వరకు అతడికి విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. అందుకే సెప్టెంబరులో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌తో పాటు దులిప్ ట్రోఫీకి కూడా బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్లను ఉద్దేశించి జస్‌ప్రీత్ బుమ్రా చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా 2016లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు బుమ్రా. ఆ తర్వాత విరాట్ కోహ్లి.. ప్రస్తుతం రోహిత శర్మ సారథ్యంలో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఎదుగుదలకు సహకరించిన కెప్టెన్ ధోని అని బుమ్రా పేర్కొన్నాడు.
ధోని ఉంటే చాలు
‘‘ఎంఎస్.. అభద్రతాభావం నా దరిచేరకుండా చూసుకున్నాడు. తన నిర్ణయాలపై.. జట్టు కూర్పుపై అతడికి మంచి పట్టు ఉంటుంది. అంతేగానీ.. ప్రణాళికలు వేసుకుని గుడ్డిగా వాటినే అనుసరించే రకం కాదు’’ అని బుమ్రా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్ ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. ఆట పట్ల అంకితభావం మెండు.
కోహ్లి ఎల్లప్పుడూ నాయకుడే
ప్రాణం పెట్టి ఆడతాడు. ఇక ఫిట్‌నెస్ విషయంలో అతడు ఎప్పుటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతడు కెప్టెన్ కాకపోవచ్చు. కానీ ఇప్పటికీ జట్టుకు నాయకుడే. కెప్టెన్సీ అనేది ఒక పదవి మాత్రమే. జట్టులోని 11 మంది రాణిస్తేనే ఫలితం రాబట్టగలం’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
ఇక బౌలర్లను అర్థం చేసుకొనే కెప్టెన్లలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడని బుమ్రా ప్రశంసించాడు. కాగా బుమ్రా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 89 వన్డేలు, 70 టీ20లు, 36 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
బుమ్రా కూడా సారథిగా
వన్డేల్లో 149, టీ20లలో 89, టెస్టుల్లో 159 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. కాగా 2022, జూలై 1న బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా.. గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, శుబ్‌మన్ గిల్‌తో అతడి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment