యూఎస్ ఓపెన్: ఫెడరర్ ఓటమి..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో సంచలనం నమోదు అయింది. ఐదు సార్లు చాంపియన్ అయిన రోజర్ ఫెడరర్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్ పొట్రో యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో కంగు తినిపించాడు. 2009 యూఎస్ ఫైనల్లో షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయిన ఈ అర్జెంటీనియన్ మరోసారి టైటిల్ రేసులో నిలిచాడు.
2009 ఫైనల్లో ఓడించిన పొట్రోను ఓడించి కసితీర్చుకోవాలనుకున్న ఫెడరర్ ఆశలు గల్లంతయ్యాయి. పురుషుల సింగిల్స్ లో భాగంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన హోరాహోరీ పోరులో పోట్రో 7-5, 3-6, 7-6(10/8), 6-4తో ఫెడరర్‌పై విజయం సాధించారు. తొలి సెట్ ను కోల్పోయి వెనుకబడిన ఫెడరర్.. రెండో సెట్ లో సునాయాసంగా విజయం సాధించాడు. కాగా, మూడో సెట్ లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగింది. అయితే టై బ్రేక్ దారి తీసిన మూడో సెట్ లో చివరకు పెట్రో రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. ఆపై అదే ఊపును కొనసాగించిన పెట్రో నాల్గో సెట్ ను సాధించి సెమీస్ కు అర్హత సాధించాడు. తద్వారా ఆరోసారి యూఎస్ ఓపెన్ గెలవాలనుకున్న ఫెడరర్ క్వార్టర్స్ నుంచి భారంగా నిష్ర్కమించాల్సి వచ్చింది. ఇక ఈ తాజా విజయంతో పొట్రో శుక్రవారం జరిగే సెమీస్‌లో వరల్డ్ నెంబర్1 నాదల్‌తో తలపడనున్నాడు.