భళా... భారత్
క్వార్టర్స్‌లో స్పెయిన్‌పై గెలుపుతో సెమీస్‌లోకి
జూనియర్ హాకీ ప్రపంచకప్
లక్నో: టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత జట్టు జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–1తో స్పెయిన్‌పై గెలిచింది. ఈ మ్యాచ్ ఆరంభంలో భారత్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబరచలేకపోయింది. అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను పదేపదే చేజార్చింది. రక్షణ పంక్తి కూడా చురుగ్గా కదల్లేకపోయింది. సమన్వయలేమితో పాటు అనవసర తప్పిదాలతో వెనుకబడింది. దీంతో కిక్కిరిసిన మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలోని ప్రేక్షకులు ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పదనుకున్నారు. అయితే భారత్ తుదికంటా పోరాడి ద్వితీయార్ధంలో చేసిన రెండు గోల్స్‌తో ఊపిరి పీల్చుకుంది.
22వ నిమిషంలోనే స్పెయిన్ జట్టుకు మార్క్ సెరాహిమా గోల్ అందించాడు. ఆ తర్వాత తీవ్రంగా పోరాడిన భారత్ ఎట్టకేలకు 57వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ చేసిన గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసింది. దీనికి కొనసాగింపుగా మరో 9 నిమిషాల తర్వాత హర్మన్‌ప్రీత్ (66వ ని.లో) గోల్ చేసి భారత్‌ను ఈ మ్యాచ్‌లో ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఇక మ్యాచ్ చివరిదాకా ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఆడటంతో భారత్ 2–1 స్కోరుతో విజయం సాధించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత్... ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకుంటుంది.