విరాట్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో కేన్ విలియమ్సన్‌కు సొగసైన ఆటగాడిగా పేరుంది. అయినా కూడా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతీరుపై ఈ కివీస్ కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ను చూస్తూ ఎంతో నేర్చుకోవచ్చని కొనియాడాడు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ఆధిపత్యం ఎంతో ప్రత్యేకమైంది. అది నన్ను చాలా ప్రభావితుడ్ని చేస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది. అలాంటి ఆటగాడి నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు’ అని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌సలో మూడో స్థానంలో ఉన్న విలియమ్సన్ చెప్పాడు.
ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, రూట్‌లను బిగ్ ఫోర్‌గా పరిగణిస్తున్నారు. ‘స్మిత్, రూట్ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. మా అందరికీ విభిన్న శైలి ఉంది. ఎవరి సొంత శైలిని బట్టి వారు ఆడడం ఈ గేమ్‌కున్న గొప్ప అందం. అందుకే అందరికీ విజయాలున్నారుు’ అని 26 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక భారత్‌తో జరగబోయే సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని అంగీకరించాడు. తమ జట్టులోనూ ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని అతడు గుర్తుచేశాడు. స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్ కూడా భారత్‌తో టెస్టు సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఈ నెల 22 నుంచి జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్ చేరుకుంది.