కరాచీ: తాను క్రికెట్ ఆడిన రోజుల్లో పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు అవమానించిన మాట వాస్తవమేని మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పష్టం చేసిన నేపథ్యంలో అతనిపై విమర్శల వర్షం కురుస్తోంది. అతనొక నీతి లేని క్రికెటర్ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ విమర్శించాడు. అసలు ఇప్పుడు ఏమి సాధించడానికి ఈ వ్యాఖ్యలు చేశారంటూ మియాందాద్ ప్రశ్నించాడు. ఇది కేవలం కనేరియా డబ్బు కోసం మాత్రమే ఇలా చేసి ఉంటాడన్నాడు. ఎప్పుడో ముగిసిన అధ్యాయాన్ని తాజాగా తెరపైకి ఎందుకు తీసుకొచ్చారో తనకు తెలియడం లేదన్నాడు.(ఇక్కడ చదవండి: అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్)
‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్. నువ్వు ఎటువంటి విలువలు లేని క్రికెటర్‌వి. క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఒక క్రికెటర్ మాటలు ప్రజలు ఎలా నమ్ముతున్నారో నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతను దేశ పరువును తీశాడు. 2000 సంవత్సరానికి ముందు నేను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నా. అప్పుడు కనేరియా జట్టులోనే ఉన్నాడు. ఆ సమయంలో కనేరియాను అవమానించిన ఏ ఒక్క ఘటన నాకు తారస పడలేదు. అతను హిందూ అనే వివక్ష ఎవరూ చూపట్టలేదు. నిన్ను అవమాన పరిస్తే 10 ఏళ్ల పాటు పాక్ క్రికెట్‌లో ఎలా కొనసాగావో తెలీడం లేదు. నీకు పాకిస్తాన్ చాలా గౌరవం ఇచ్చింది’ అని మియాందాద్ ధ్వజమెత్తాడు.
పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు దానిష్ కనేరియాపై వివక్ష చూపెట్టేవారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వెల్లడించడంతో వివాదం మొదలైంది. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు. చివరకు అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం తాను చూశానన్నాడు. ఇక్కడ మొత్తం జట్టు అంతా అలా ఉండేది కానీ, మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు. ఇందుకు అక్తర్‌కు కనేరియా థాంక్స్ చెప్పడంతో వివాదం మరింత రాజుకుంది. వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానంటూ కనేరియా స్పష్టం చేశాడు. దాంతో కనేరియాపై పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు ఎక్కుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment