ఈ రోజు భారత క్రికెట్ కు వెరీ స్పెషల్..
న్యూఢిల్లీ: ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది. భారత క్రికెట్ జట్టుకు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా 34 ఏళ్ల క్రితం భారత క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకున్న రోజు. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు.. అప్పటికే రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ ను మట్టికరిపించి సగర్వంగా టైటిల్ ను అందుకున్న రోజు. ఈ సందర్భంగా ఆనాటి క్షణాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
1983, జూన్ 25వ తేదీన లండన్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆనాటి 60 ఓవర్ల ప్రపంచకప్ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. క్రిష్ణమాచారి శ్రీకాంత్(38), మొహిందర్ అమర్ నాథ్(26), యస్పల్ శర్మ(11), సందీప్ పాటిల్(27), కపిల్ దేవ్(15), మదన్ లాల్(17), కిర్మాణి(14), బల్విందర్ సందూ(11నాటౌట్)లు రెండంకెల స్కోరును చేయగా, సునీల్ గవాస్కర్(2), రోజర్ బిన్నీ(2), కీర్తి ఆజాద్(0)లు నిరాశపరిచారు. ఇక్కడ భారత్ కు ఎక్స్ట్రాల రూపంలో వచ్చిన పరుగులు 20 కావడం విశేషం. దాంతో భారత్ జట్టు సాధారణ స్కోరును మాత్రమే వెస్టిండీస్ ముందు ఉంచకల్గింది.
భారత జట్టు తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో ఓటమి తప్పదనుకున్నారు. అప్పటికే వరుసగా రెండు వరల్డ్ కప్ లు గెలిచిన విండీస్ కు ఈ స్కోరు ఎంతమాత్రం కష్టం కాదనే వాదన వినిపించింది. అయితే అందరి అంచనాలు తల్లక్రిందులయ్యాయి. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ కుదేలైపోయింది. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన విండీస్ ను 52 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూల్చి భారత జట్టు విశ్వవిజేతగా అవతరించింది. మదన్ లాల్, అమర్ నాథ్లు తలో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా, సందూకు రెండు వికెట్లు సాధించాడు. కపిల్ దేవ్, రోజర్ బిన్నీలు చెరో వికెట్ తీసి భారత్ విజయంలో భాగస్యామ్యమయ్యారు.