భారత క్రికెటర్లు పాండ్యా, కే ఎల్ రాహుల్ ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదంపై గంగూలీ, రాహుల్ ద్రవీడ్ వంటి ప్రముఖ క్రికెటర్లు స్పందించారు. అయితే ఇంత వివాదానికి వేదికగా నిలిచిన ‘కాఫీ విత్ కరణ్ షో’ హోస్ట్ కరణ్ జోహర్ మాత్రం ఇంతవరకూ ఈ విషయం గురించి మాట్లడలేదు. దాంతో కరణ్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయంపై స్పందించారు కరణ్.
కరణ్ జోహార్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘పాండ్యా, రాహుల్ విషయంలో జరిగిన నష్టానికి నేను చింతిస్తున్నాను. నా షోలో ఇలా జరగడం నిజంగా దురదృష్టం. ఇందుకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. నేనే వారిని ఈ కార్యక్రమానికి గెస్ట్‌లుగా పిలిచాను. షోలో ఉన్నంతవరకే ఏదైనా నా కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి టెలికాస్ట్ అయితే తరువాతి పరిస్థితులు నా చేతిలో ఉండవు. ప్రస్తుతం ఇదే జరిగింది. నా షో వల్ల రాహుల్, పాండ్యాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీని గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఈ నష్టాన్ని నేను నివారించలేకపోయాను అంటూ నా సన్నిహితుల దగ్గర చెప్పుకుని చాలా బాధపడ్డాను. కానీ ఏం లాభం. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందం’టూ విచారం వ్యక్తం చేశారు కరణ్.
మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు బీసీసీఐ వారిని జట్టు నుంచి తప్పించింది. అర్ధాంతరంగా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment