
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు ఖాతాలో మూడో విజయం చేరింది. మధ్యప్రదేశ్‌తో బుధవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఆంధ్ర జట్టుకు ఆడుతోన్న భారత క్రికెటర్ కరణ్ శర్మ (29 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలుత మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 248 పరుగులు సాధించింది. అశుతోష్ సింగ్ (110; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ... మనోజ్ సింగ్ (62; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించారు.
ఆంధ్ర బౌలర్లలో శివ, షోయబ్, కరణ్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. 249 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు సరిగ్గా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్లు అశ్విన్ హెబర్ (53; 8 ఫోర్లు, సిక్స్), కోన శ్రీకర్ భరత్ (30) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. మిడిల్ ఆర్డర్‌లో డీబీ రవితేజ (53; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఒకదశలో ఆంధ్ర 160 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా... రవితేజ, కరణ్ శర్మ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. విజయానికి 4 పరుగుల దూరంలో... మూడు బంతులు మిగిలి ఉండగా కరణ్ ఔటైనా... శివ (3 నాటౌట్) ఆఖరి బంతికి జట్టును విజయతీరానికి చేర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment