మొహాలీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ సెంచరీ (123 బంతుల్లో 139; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. ఫలితంగా గురువారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీపై 79 పరుగుల భారీ తేడాతో హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. టోర్నీలో హైదరాబాద్‌కు వరుసగా ఇది రెండో విజయం. ఎనిమిది పాయింట్లతో హైదరాబాద్ గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఢల్లీ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. అతడికి చందన్ సహాని (74 బంతుల్లో 87; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కూడా భారీ సిక్సర్లతో చెలరేగారు. తిలక్, సహాని నాలుగో వికెట్‌కు 152 పరుగులు జోడించడంతో హైదరాబాద్ భారీ స్కోరును అందుకుంది. ఛేదనలో ఢిల్లీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరు గులు చేసి ఓడింది. హిమ్మత్ సింగ్ (65 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. శిఖర్ ధావన్ (12) విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు తీశాడు.
ముంబై: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్రపై 8 వికెట్ల తేడాతో విదర్భ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. ఓపెనర్ సీఆర్ జ్ఞానేశ్వర్ (126 బంతుల్లో 93; 7 ఫోర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అంబటి రాయుడు (49 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... చివర్లో పిన్నింటి తపస్వి (25 బంతుల్లో 45; 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ శ్రీకర్ భరత్ (18), రికీ భుయ్ (21) భారీ స్కోర్లు సాధించలేకపోయారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్, ఆదిత్య సర్వతే చెరో మూడు వికెట్లు తీశారు. ఛేదనలో విదర్భ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ అథర్వ (123 బంతుల్లో 164 నాటౌట్; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడు గణేశ్ సతీశ్ (53 బంతుల్లో 43; 3 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 118 పరుగులు... యశ్ రాథోడ్ (48 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు మరో 118 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment