మనం ఆడేది ఏ ఆటైనా సరే(కొన్నింటిని మినహాయిస్తే) అందులో కెప్టెన్ అనేవాడు తప్పకుండా ఉంటాడు. జట్టును ముందుండి నడిపిండమే గాక అవసరమైన సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. జట్టు గెలిచినా, ఓడినా మొదట అందరూ కెప్టెన్‌ను తిడుతారు. ఇక జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్ విషయానికి వస్తే కెప్టెన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి హోదాను జట్టులోని ప్రతీఒక్కరు కావాలని కోరుకుంటారు. అయితే అది అందరికి దక్కదు.. ఒకవేళ దక్కినా దానిని నిలబెట్టుకోరు. కానీ కొందరికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే.(‘అక్కడ నువ్వెంత స్టార్ అనేది చూడరు’)
70వ దశకం నుంచి చూసుకుంటే విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ మొదలుకొని కపిల్‌దేవ్, ఇమ్రాన్ ఖాన్, స్టీవా, రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలి, గ్రేమ్ స్మిత్ వరకు ఏదో ఒక దశలో తన ప్రాభల్యం ఘనంగానే చాటారు. అయితే వీరందరి కంటే తన ద్రుష్టిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యున్నత స్థానంలో ఉంటాడని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తెలిపాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పీటర్సన్ ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.
'భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు సాధించిపెట్టిన ధోని అత్యున్నత కెప్టెన్‌గా నిలుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను ధోని కెప్టెన్సీని ప్రత్యక్షంగా ఎన్నోసార్లు చూశాను. మ్యాచ్ గెలిచే సమయంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న ప్రతీసారి మైదానంలో ధోని కూల్‌గా ఉంటాడు. అంత ఒత్తిడిలోనూ అతని తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు అనుకూలంగా మారాయి. అతని మనోదైర్యానికి, కెప్టెన్‌గా వ్యవహరించిన తీరుకు చాలా ముగ్దుడినయ్యా. నేను ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించా. కానీ అన్నిసార్లు నేను తీసుకున్న నిర్ణయాలు సఫలం కాలేదు. అందుకే అతన్ని అందరూ ముద్దుగా కూల్ కెప్టెన్ అని పిలుస్తుంటారు. ఇది నా అంచనా మాత్రమే.. కెప్టెన్లుగా సక్సెస్ చూసిన ఆటగాళ్ల గురించి నేను తక్కువ చేసి మాట్లాడడం లేదని' పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్‌లో ధోని కెప్టెన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను జట్టుకు అందించి తన పేరును మరింత సుస్థిరం చేసుకున్నాడు. అంతేగాక ధోని సారధ్యంలోనే టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. ధోని టీమిండియాకు మొత్తం 60 టెస్టుల్లో నాయకత్వం వహించి 27 టెస్టుల్లో గెలిపించి గంగూలీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు సంపాధించాడు. ప్రస్తుతం అతని వారసత్వాన్ని అందుకున్న కోహ్లి జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు.
ధోని కెప్టెన్‌గానే గాక బెస్ట్ ఫినిషర్ అనడంలో సందేహం అవసరం లేదు. జట్టు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి బరిలోకి దిగి ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలందించాడు. అందుకు 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ఉదాహరణగా తీసుకోవచ్చు. టీమిండియా కెప్టెన్‌గానే కాదు ఐపీఎల్‌లోనూ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ను మూడు సార్లు విజేతగా నిలిపి తన ప్రతిభేంటో చూపించాడు. అయితే 2019లో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం జట్టుకు దూరమైన ధోని అప్పటినుంచి ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. క్రికెట్ బతికున్నంతవరకు ధోని పేరు చిరస్థాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన కెరీర్‌లో 350 వన్డేలాడి 10773 పరుగులు, 90 టెస్టులాడి 4876 పరుగులు, 98 టీ20ల్లో 1627 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment