లండన్: క్రికెట్‌లో హెలికాప్టర్ షాట్ అంటే తెలియని వారుండరు. ఆ షాట్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఎంఎస్ ధోని. అంత పాపులర్ అయిన ఆ షాట్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఏదో ఒక సందర్భంలో ప్రయత్నించడం చాలసార్లే చూశాం. తాజాగా ఆఫ్ఘన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ గోల్ప్ ఆటలో హెలికాప్టర్ షాట్ ఆడడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం కౌంటీ ఆడేందుకు లండన్ వచ్చిన రషీద్ ఒక గోల్ప్‌కోర్టుకు వెళ్లాడు. రూఫ్ టాఫ్ ఎత్తులో ఉన్న గోల్ఫ్‌ను కొట్టే క్రమంలో ధోని హెలికాప్టర్ షాట్‌ను ఉపయోగించాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు.
'' రషీద్.. నీ గోల్ప్ చాలా బాగుంది.. కానీ ఒక విషయం మర్చిపోయావు. అది గోల్ప్ ఆట, అక్కడెందుకు హెలికాప్టర్ షాట్. ఎలాగు షాట్ కొట్టేశావు కాబట్టి ఈసారి స్విచ్ హిట్ కొట్టే ప్రయత్నం చేయ్'' అంటూ కామెంట్ చేశాడు. స్విచ్ హిట్‌కు కెవిన్ పీటర్సన్ పెట్టింది పేరు. 2006లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో పీటర్సన్ తొలిసారి స్విచ్ షాట్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ కూడా ఈ షాట్‌ను బాగా ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఇక రషీద్ ఇటీవలే కౌంటీ క్రికెట్ ఆడేందుకు దుబాయ్ నుంచి లండన్ చేరుకున్నాడు. విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ససెక్స్ షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉన్న రషీద్ బుధవారం నుంచి బరిలోకి దిగుతున్నాడు. కాగా ససెక్స్‌షైర్ ఈ సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడగా నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఐదు డ్రాలతో ఉంది. రషీద్ రాకతో ఆ జట్టు కాస్త బలంగా తయారైందని చెప్పొచ్చు. ఇదే జట్టులో జో రూట్, డేవిడ్ మలాన్, వహబ్ రియాజ్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment