
కెవిన్ పీటర్సన్
సాక్షి, స్పోర్ట్స్ : ‘మూలిగే నక్కమీద తాటి పండు పడ్టట్లుంది’ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నిర్వహాకుల పరిస్థితి. దుబాయ్ వేదికగా పీఎస్‌ఎల్ మూడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైనా.. ప్రేక్షకాదరణ లేక స్టేడియాలన్నీ బోసిబోయి కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌లను స్వదేశానికి తరలిస్తే అభిమానుల ఆదరణ పెరుగుతుందని భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ సీజన్ క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్వెట్టా గ్లాడియేటర్స్ తరుఫున ఆడుతున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పీసీబీకి షాకిచ్చాడు. పాక్‌లో జరిగే మ్యాచ్ తాను ఆడనని కుండలు బద్దలుకొట్టాడు.
ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పీటర్సన్ 34 బంతుల్లో 48 పరుగులు చేసి క్వెట్టా గ్లాడియేటర్స్‌కు లీగ్‌లో రెండో విజయాన్నందించాడు. ఈ మ్యాచ్ అనంతరం ‘ఒకవేళ మీ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తే పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరవుతారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్కడికి వెళ్లి ఆడలేనని బదులిచ్చాడు. తాన జట్టు ఫైనల్ కు చేరినా తాను పాక్ లో ఆడనని తెగేసి చెప్పాడు.
ఈ సీజన్ మూడు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు లాహోర్‌లో జరగనుండగా.. మార్చి 25న జరిగే ఫైనల్‌కు కరాచీ నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment