మూడోసారి ఫైనల్లోకి శ్రీకాంత్
లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ వరుసగా మూడో ఏడాది టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 21-14, 21-7తో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు.
ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 73వ ర్యాంకర్ యుజియాంగ్ హువాంగ్ (చైనా)తో శ్రీకాంత్ తలపడతాడు. మరో సెమీఫైనల్లో యుజియాంగ్ 17-21, 22-20, 21-12తో యుకి షి (చైనా)పై గెలిచాడు. 2014లో జుయ్ సాంగ్ (చైనా) చేతిలో, 2015లో కశ్యప్ (భారత్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ మూడోసారైనా విజేతగా నిలుస్తాడో లేదో వేచి చూడాలి.
మరోవైపు పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ (భారత్) జంట 25-23, 13-21, 21-17తో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ కిమ్ జి జుంగ్-కిమ్ సా రాంగ్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో వీ షెమ్ గో-వీ కియోంగ్ తాన్ (మలేసియా) ద్వయంతో ప్రణవ్-అక్షయ్ తలపడతారు. మహిళల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 14-21, 16-21తో జుంగ్ కుంగ్ యున్-షిన్ సెయుంగ్ చాన్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది.