Syed Modi Grand Prix Gold badminton tournament
-
మూడోసారి ఫైనల్లోకి శ్రీకాంత్
లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ వరుసగా మూడో ఏడాది టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 21-14, 21-7తో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 73వ ర్యాంకర్ యుజియాంగ్ హువాంగ్ (చైనా)తో శ్రీకాంత్ తలపడతాడు. మరో సెమీఫైనల్లో యుజియాంగ్ 17-21, 22-20, 21-12తో యుకి షి (చైనా)పై గెలిచాడు. 2014లో జుయ్ సాంగ్ (చైనా) చేతిలో, 2015లో కశ్యప్ (భారత్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ మూడోసారైనా విజేతగా నిలుస్తాడో లేదో వేచి చూడాలి. మరోవైపు పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ (భారత్) జంట 25-23, 13-21, 21-17తో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ కిమ్ జి జుంగ్-కిమ్ సా రాంగ్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో వీ షెమ్ గో-వీ కియోంగ్ తాన్ (మలేసియా) ద్వయంతో ప్రణవ్-అక్షయ్ తలపడతారు. మహిళల డబుల్స్ విభాగం సెమీఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 14-21, 16-21తో జుంగ్ కుంగ్ యున్-షిన్ సెయుంగ్ చాన్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో శ్రీకాంత్
లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకోగా... నాలుగో సీడ్ పారుపల్లి కశ్యప్ (భారత్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాంత్ 21-17, 18-21, 24-22తో గో సూన్ హువాట్ (మలేసియా)పై కష్టపడి గెలుపొందగా... డిఫెండింగ్ చాంపియన్ కశ్యప్ 16-21, 21-18, 15-21తో ప్రపంచ 73వ ర్యాంకర్ యుజియాంగ్ హువాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 23-21, 21-17తో సుపజిరాకుల్-సప్సిరి (థాయ్‌లాండ్) జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ (భారత్) జంట 22-20, 11-21, 23-21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న మాడ్స్ పీటర్సన్-మాడ్స్ పీలర్ (డెన్మార్క్) జోడీపై సంచలన విజయం సాధించింది. -
సింధుకు షాక్
♦ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి ♦ క్వార్టర్స్‌లో శ్రీకాంత్, కశ్యప్ ♦ సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఊహిం చని షాక్ ఎదురైంది. గత ఆదివారం మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను నెగ్గి ఊపు మీదున్న సింధు గురువారం హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్ ఫైనల్లో 21-18, 24-26, 17-21 తేడాతో ప్రపంచ 27వ ర్యాంకర్ జిందాపోల్ (థాయ్‌లాండ్)చేతిలో ఓడింది. గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సింధు గెలుచుకున్నా ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21-9, 21-12 తేడాతో ఇస్కందర్ జైనుద్దీన్‌పై సునాయాసంగా నెగ్గి క్వార్టర్స్ చేరాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ కశ్యప్ కూడా 21-19, 21-10 తేడాతో జు సియువాన్ (చైనా)పై గెలిచాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ గుత్తా జ్వాల, అశ్విని జంట 21-9, 21-10 తేడాతో నింగ్షి బ్లాక్ హజారికా, హారికపై గెలిచింది. -
ప్రిక్వార్టర్స్ లో శ్రీకాంత్, కశ్యప్
జయరామ్, సాయిప్రణీత్‌లకు షాక్ లక్నో: సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, డిఫెండింగ్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీకాంత్ (భారత్) 21-18, 21-14తో జూ వెన్ సూంగ్ (మలేసియా)పై, కశ్యప్ (భారత్) 21-14, 26-28, 21-17తో డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచారు. అయితే భారత్‌కే చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ అజయ్ జయరామ్, ప్రపంచ 34వ ర్యాంకర్ సాయిప్రణీత్‌లకు రెండో రౌండ్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రపంచ 217వ ర్యాంకర్ శ్రేయాన్ష్ జైస్వాల్ (భారత్) 21-18, 15-21, 21-15తో జయరామ్‌పై, ప్రపంచ 178వ ర్యాంకర్ హర్షీల్ డాని (భారత్) 14-21, 21-17, 21-16తో సాయిప్రణీత్‌పై సంచలన విజయం సాధించారు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్, సిరిల్ వర్మ తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. గురుసాయిదత్ 10-21, 17-21తో జైనుద్దీన్ (మలేసియా) చేతిలో; సిరిల్ వర్మ 8-21, 18-21తో బున్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21-6, 21-7తో రియా ముఖర్జీ (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) 21-6, 21-14తో హీతెర్-లారెన్ (ఇంగ్లండ్)లపై, సిక్కి రెడ్డి-మనీషా (భారత్) 21-7, 21-11తో సారా నక్వీ-రియా పిళ్లై (భారత్)లపై విజయం సాధించారు.