ఫైనల్లో సైనా, శ్రీకాంత్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో మహిళల, పురుషుల విభాగాల్లో సైనా, కిడాంబి శ్రీకాంత్‌లు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్‌సీడ్ సైనా 21-15, 21-11తో యు హాషిమోటో (జపాన్)పై గెలవగా, రెండోసీడ్ శ్రీకాంత్ 21-16, 21-13తో క్వాలిఫయర్ జుయ్ సాంగ్ (చైనా)ను ఓడించాడు. హాషిమోటోతో 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా సుదీర్ఘమైన ర్యాలీలతో పాటు చక్కటి డ్రాప్ , డీప్ షాట్లు, రిటర్న్స్‌తో ఆకట్టుకుంది.
తొలి గేమ్‌లో 18-12 ఆధిక్యం తర్వాత సైనా సర్వీస్ ఫాల్ట్‌లు చేసింది. కానీ చివర్లో హాషిమోటో రెండు అనవసర తప్పిదాలు చేయడంతో హైదరాబాద్ అమ్మాయి గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ కొనసాగిన జపాన్ క్రీడాకారిణి తప్పిదాలను ఆసరాగా చేసుకున్న సైనా 11-2 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సునాయాసంగా నెగ్గింది. ఫైనల్లో సైనా... రత్చనోక్ (థాయ్‌లాండ్)తో ఆడుతుంది.
సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఆరంభంలో కాస్త వెనుకబడినా బాగా పుంజుకున్నాడు. 4-4, 7-7తో స్కోరు సమమైన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఓ దశలో సాంగ్ 16-17తో దూసుకొచ్చినా.. భారత కుర్రాడి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. రెండో గేమ్‌లో సాంగ్ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లినా.. శ్రీకాంత్ వరుస పాయింట్లతో 9-9తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మరింత దూకుడు పెంచి సాంగ్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ గెలిచాడు. ఫైనల్లో శ్రీకాంత్... అక్సెల్‌సెన్ (డెన్మార్క్)తో తలపడతాడు.