మొహాలి: ఐపీఎల్–12లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మరో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌లో ధాటిగా పరుగులు చేయలేకపోయింది. తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టులో నాలుగే వికెట్లు పడేసింది. చివరకు సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. వార్నర్ (62 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. అశ్విన్, షమీ, ముజీబుర్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ (53 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ (43 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. సందీప్ శర్మకు 2 వికెట్లు దక్కాయి.
పవర్ లేని ప్లే
ఈ సీజన్‌లో జోరుమీదున్న ఓపెనింగ్ జోడీ ఏదైనా ఉందంటే అది వార్నర్, బెయిర్ స్టో జోడీనే. కానీ ఈ మ్యాచ్‌లో ఈ ద్వయం ఆట సాగలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన సన్ ఇన్నింగ్స్ రైజింగ్ కాలేదు. సొంతగడ్డపై కింగ్స్ బౌలర్లు వికెట్లు తీయకపోయినా పరుగుల్ని కట్టడి చేశారు. పది ఓవర్ల దాకా షాట్లకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. రెండో ఓవర్ వేసిన ముజీబుర్ రహ్మాన్... బెయిర్ స్టో (1) కథ ముగించాడు. ఈ ఓవర్లోనే విజయ్ శంకర్ వచ్చీరాగానే బౌండరీ కొట్టగా... డాషింగ్ ఓపెనర్ వార్నర్ ఓ ఫోర్ కోసం 16 బంతులాడి చివరకు ఐదో ఓవర్లో బాదాడు. ఆశ్చర్యకరంగా పవర్ ప్లేలో నమోదైన బౌండరీలు ఈ రెండే! ఏమాత్రం పవర్ లేని ఈ ప్లేలో సన్‌రైజర్స్ 27/1 స్కోరు చేసింది.
వార్నర్ కడదాకా నిలిచినా...
విధ్వంసకారుడు వార్నర్ క్రీజులో ఉన్నా హైదరాబాద్ పరుగులు చేసేందుకు కష్టపడింది. 11వ ఓవర్లో బౌండరీ కొట్టిన శంకర్ (27 బంతుల్లో 26; 2 ఫోర్లు)ను అశ్విన్ ఔట్ చేశాడు. కానీ సన్ ఇన్నింగ్స్ మాత్రం చప్పగా సాగిపోయింది. ఆటలో వార్నర్ మెరుపుల్లేవ్... బ్యాటింగ్‌లో జోరు లేదు. 14వ ఓవర్లో అశ్విన్ పాదరసంలా స్పందించడంతో నబీ (12) రనౌటయ్యాడు. 16వ ఓవర్లో వార్నర్ సిక్సర్ కొట్టి 49 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో పాండే (19) ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన హుడా (14 నాటౌట్) 2 ఫోర్లు, సిక్సర్ బాదడంతో హైదరాబాద్ సరిగ్గా 150 పరుగులు చేసింది.
రాహుల్, మయాంక్... ఫిఫ్టీ–ఫిఫ్టీ
పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్ కూడా మోస్తరుగానే సాగింది. కె.ఎల్.రాహుల్‌కు జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన గేల్ (14 బంతుల్లో 16) ఫోర్, సిక్స్‌తో జోరు పెంచే ప్రయత్నానికి రషీద్ ఖాన్ అడ్డుకట్టవేశాడు. తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్‌తో కలిసి రాహుల్ భారీ భాగస్వామ్యానికి బాటలు వేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి కింగ్స్ స్కోరు. 69/1. గత మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడి గెలిచే మ్యాచ్‌ను కోల్పోయిన కింగ్స్ కాస్త ముందుగానే కళ్లు తెరిచింది. 11వ ఓవర్లో మయాంక్ ఒక ఫోర్, రాహుల్ ఫోర్, సిక్స్‌తో 17 పరుగుల్ని పిండుకున్నారు. ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 114 పరుగులు జోడించాక మయాంక్‌ను... ఆ తర్వాత మిల్లర్ (1)ను సందీప్ శర్మ ఔట్ చేశాడు. తర్వాత కౌల్ బౌలింగ్‌లో మన్‌దీప్ (2) ఔట్ కావడంతో ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది... కరన్ 2, 2, 1 కొట్టగా, రాహు ల్ 4, 2తో మరో బంతి మిగిలుండగానే ముగించాడు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ నాటౌట్ 70; బెయిర్ స్టో (సి) అశ్విన్ (బి) ముజీబ్ 1; శంకర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 26; నబీ రనౌట్ 12; పాండే (సి) (సబ్) కరుణ్ నాయర్ (బి) షమీ 19; హుడా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–7, 2–56, 3–80, 4–135.
బౌలింగ్: అంకిత్ 4–0–21–0, ముజీబ్ 4–0–34–1, షమీ 4–0–30–1, అశ్విన్ 4–0–30–1, కరన్ 4–0–30–0.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 71; గేల్ (సి) హుడా (బి) రషీద్ 16; మయాంక్ (సి) శంకర్ (బి) సందీప్ 55; మిల్లర్ (సి) హుడా (బి) సందీప్ 1; మన్‌దీప్ (సి) హుడా (బి) కౌల్ 2; కరన్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 151.
వికెట్ల పతనం: 1–18, 2–132, 3–135, 4–140.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–0, సందీప్ 4–0–21–2, రషీద్ 4–0–20–1, నబీ 3.5–0–42–0, కౌల్ 4–0–42–1.
హైదరాబాద్ మళ్లీ ఓడింది!
Published Tue, Apr 9 2019 5:14 AM | Last Updated on Tue, Apr 9 2019 8:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment