
ముంబై: పని పట్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని టీమిండియా మాజీ ఆటగాడు, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కిరణ్ మోరె అన్నారు. ధోని బయోపిక్ కోసం సుశాంత్ తన వద్ద 9 నెలల కఠోర సాధన చేశాడని తెలిపారు. ధోని తరహా ఆటతీరు కనబర్చే ప్రయత్నంలో అతను ఎన్నో గాయాలపాలయ్యాడని చెప్పారు. ఆక్రమంలోనే పక్కటెముకల గాయంతో 10 రోజులపాటు కోచింగ్‌కు దూరమయ్యాడని మోరె గుర్తు చేసుకున్నారు. కఠోర సాధనతో కష్టసాధ్యమైన కీపింగ్ నేర్చుకున్నాడని, ఫాస్ట్ బౌలర్లు, బౌలింగ్ మెషీన్ వేసే బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో అతని పోరాటపటిమకు తాను ముగ్ధుణ్ని అయ్యానన్నారు.
(చదవండి: 'కావాలనే సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు')
‘నెట్స్‌లో సాధన చేసేటప్పుడు సుశాంత్‌తో మాటలకన్నా.. ఒకరకమైన తిట్లతోనే గడిచిపోయేది. అయినప్పటికీ అతను నాపై ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదు. ఆటపైనే దృష్టి పెట్టేవాడు. తెల్లవారు జామున, సాయంత్రం వేళల్లో, ఇటి దగ్గరా సుశాంత్ ప్రాక్టీస్ చేసి.. ఆ విశేషాలను నాతో పంచుకునేవాడు. మొత్తంమీద కోచింగ్ పూర్తయ్యేటప్పటికీ మా మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. ధోని బయోపిక్‌కోసం అతని నిబద్థత చూసి.. ఆ సినిమా చక్కగా వస్తుందనుకున్నా. దాంతోపాటు సుశాంత్ కెరీర్‌లో ఇది అద్భుతమైన పాత్ర అవుందని, నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని భావించా.
ధోని తర్వాత హెలికాప్టర్ షాట్స్‌తో అదరగొట్టిన రెండో వ్యక్తి సుశాంతే. అదే విషయం తనదో చెప్పా. తను పొంగిపోయాడు. నెలన్నర కష్టపడి అతను హెలికాప్టర్ షాట్స్ ఆడటం నేర్చుకున్నాడు. అనంతరం అలవోకగా.. రోజూ 100 షాట్లు ఆడాడు. మూడు నాలుగు గంటల సెషన్లో 300 నుంచి 400 బంతుల్ని సుశాంత్ ఎదుర్కొనేవాడు. అలసటే లేకుండా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యేవాడు. తనను ఔట్ చెయ్యాలని నెట్ బౌలర్లకు చాలెంజ్ చేసేవాడు’అని కిరణ్ మోరె సుశాంత్‌తో సాగిన కోచింగ్ విశేషాలను నెమరేసుకున్నారు. కాగా, ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ఇక్కడ ఎవరూ ఎవరినీ పట్టించుకోరు: సైఫ్ అలీఖాన్)
Comments
Please login to add a commentAdd a comment