
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, సహచరుడు ధోనితో తన బంధం దృఢమైందని టీమిండియా సారథి విరాట్ కోహ్లి అన్నాడు. బయటి వ్యక్తులెవరూ తమ ఇద్దరి మధ్య తలదూర్చలేరని... తమ స్నేహాన్ని చెడగొట్టలేరని స్పష్టం చేశాడు. ఓ టీవీ వెబ్ సిరీస్ కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ‘చాలా మంది మా అనుబంధాన్ని దెబ్బతీసే కథనాలు రాశారు. అదృష్టవశాత్తూ అవేవీ మేం చదవలేదు. మా సాన్నిహిత్యాన్ని చూసి కూడా కొందరు ‘మీ మధ్య విభేదాలొచ్చాయటగా’ అని అడుగుతారు. అప్పడు మేం ఓ నవ్వు నవ్వేసి ఊరుకుంటాం. ఆసీస్ క్రికెటర్ హెడెన్ కూడా ధోని చాలా సరదా మనిషని చెబుతాడు. అకాడమీలో నా అండర్–17 రోజుల్లో కొత్త కుర్రాడికి బౌలింగ్ వేసేందుకు బంతినిచ్చి కహా సే (ఏ బౌలింగ్ ఎండ్ నుంచి వేస్తావు) అని అడిగా.
దానికి అతను ‘భయ్యా నజాఫ్‌గఢ్ సే’ (అన్నా నజాఫ్‌గఢ్ నుంచి) అని చెప్పడం ఎక్కడ లేని నవ్వు తెప్పించింది. దీన్ని క్రికెట్ మ్యాచ్ బౌలింగ్ సమయంలో పదే పదే ధోనికి గుర్తుచేసి నవ్వుకుంటాం’ అని అన్నాడు. యేటికేడు పెరుగుతున్న వయస్సులాగే తమ స్నేహం కూడా పెరుగుతోందని కోహ్లి చెప్పాడు. క్రికెట్ సలహాలను ధోని నుంచే తీసుకుంటానని... ఆలోచనలను పంచుకున్న ప్రతీసారి ధోని సానుకూలంగా స్పందిస్తాడని అన్నాడు. ‘సారథ్యం చేపట్టిన కొత్తలో ధోని ముందుండి నడిపించేవాడు. క్లిష్టమైన పరిస్థితుల్ని చక్కగా సరిదిద్దేవాడు. అతనిలాంటి సహచరుడు ఉండటం నా అదృష్టం. ధోని సత్తాసామర్థ్యాల్ని నేను గుడ్డిగా నమ్మేస్తాను’ అని అన్నాడు. హర్దిక్ పాండ్యా జట్టులో ఓ ఎంటర్‌టైనర్ అని చెప్పాడు. రంజీ ట్రోఫీ సందర్భంగా శిఖర్ ధావన్‌తో ఆన్ ఫీల్డ్‌లో సరదా సంభాషణలు జరిగేవని పేర్కొన్నాడు.
29వ పడిలోకి కోహ్లి
భారత బ్యాటింగ్ సంచలనం, కెప్టెన్ కోహ్లి ఆదివారం 29వ పడిలోకి ప్రవేశించాడు. టీమిండియా సహచరుల మధ్య అతని జన్మదిన వేడుక జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు సామాజిక సైట్లలో శుభాకాంక్షలతో ముంచెత్తారు. సెలెబ్రిటీలు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘యువ క్రికెటర్, భారత్‌ను గెలిపిస్తున్న విజయవంతమైన సారథికి హ్యాపీ బర్త్ డే. నీ జైత్రయాత్ర, శతకాల సక్సెస్ సుదీర్ఘంగా కొనసాగాలి’ అని క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ ఆటతో గెలిపించాలి... నాయకత్వంతో భారత్‌ను నడిపించాలని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment