
ఓ దశలో ఆసీస్ స్కోరు 37.4 ఓవర్లలో 224/1. అప్పటికే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వీర బాదుడుతో శతకం సాధించి జట్టును అత్యంత పటిష్టమైన స్థితికి చేర్చగా, అతనితో పాటు క్రీజులో స్మిత్ ఉన్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉండటంతో స్కోరు 350 వరకు చేరుతుందేమో అని అంతా భావించారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు వారిని ఓ ఆటాడుకున్నారు. వరుస బంతుల్లో స్మిత్, మ్యాక్సీ పెవిలియన్‌కు చేరడంతో మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా చివరి 10 ఓవర్లలో జట్టు కేవలం 59 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఎప్పటిలాగే టీమిండియా బ్యాట్స్‌మెన్ తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఓపెనర్లు రోహిత్, రహానే అర్ధసెంచరీలతో చెలరేగి శుభారంభాన్ని అందించగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మరో చక్కటి విజయం భారత్ వశమైంది. కోహ్లి కెప్టెన్సీలో ఇది భారత్‌కు వరుసగా తొమ్మిదో విజయం. దీంతో ధోని రికార్డును సమం చేశాడు.
ఇండోర్: టీమిండియా జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఓటమనేదే లేకుండా సాగుతున్న కోహ్లి సేన ఖాతాలో మరో వన్డే సిరీస్ చేరింది. సిరీస్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియా జట్టు నుంచి బ్యాటింగ్ మెరుపులు కనిపించినా టీమిండియా సత్తా ముందు అది కూడా సరిపోలేదు. ఫ్లాట్ పిచ్‌పై దుమ్ము రేపిన రోహిత్ (62 బంతుల్లో 71; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రహానే (76 బంతుల్లో 70; 9 ఫోర్లు)కు తోడు చివర్లో హార్దిక్ పాండ్యా (72 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ విసిరిన భారీ లక్ష్యం ఉఫ్‌మని తేలిపోయింది. ఫలితంగా ఆదివారం స్థానిక హోల్కర్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3–0తో ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 293 పరుగులు చేసింది. ఫించ్ (125 బంతుల్లో 124; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో మెరిశాడు. స్మిత్ (71 బంతుల్లో 63; 5 ఫోర్లు), వార్నర్ (44 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కుల్దీప్ యాదవ్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 5 వికెట్లకు 294 పరుగులు చేసి నెగ్గింది. మనీశ్ పాండే (32 బంతుల్లో 36 నాటౌట్; 6 ఫోర్లు) తన ఫామ్‌ను అందుకున్నాడు. కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఫించ్ దూకుడు
సిరీస్‌లో తొలిసారిగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కింది. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఓపెనర్ ఫించ్ పిచ్‌ను సద్వినియోగం చేసుకుని చెలరేగాడు. ఆరంభంలో నెమ్మదిగా ప్రారంభించిన అతను ఆ తర్వాత జూలు విదిల్చాడు. మూడో ఓవర్‌లో ఫించ్ రెండు ఫోర్లు బాదగా తొమ్మిదో ఓవర్‌లో వార్నర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో స్కోరు 49 పరుగులకు చేరింది. అయితే 14వ ఓవర్‌లో పాండ్యా ఆఫ్ కట్టర్‌కు వార్నర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే భారత్ ఆనందం ఎంతో సేపు నిలవకుండా ఫించ్, స్మిత్ జోడి చెలరేగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా ఆసీస్‌ను ఇబ్బంది పెట్టిన చైనామన్ కుల్దీప్‌ను లక్ష్యంగా చేసుకున్న ఫించ్ అతడు వేసిన 26 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. తను వేసిన 30వ ఓవర్‌లో వరుసగా 4, 6తో చెలరేగగా... 34వ ఓవర్‌లో కుల్దీప్ వేసిన గూగ్లీ బంతిని స్వీప్ షాట్‌తో బౌండరీ సాధించి వన్డేల్లో 8వ సెంచరీ (110 బంతుల్లో)ని అందుకున్నాడు. అదే ఓవర్‌లో భారీ సిక్స్‌ను సాధించాడు. అటు స్మిత్ 55 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో కుల్దీప్ మాయకు ఈసారి ఫించ్ దొరికాడు. డీప్ మిడ్‌వికెట్‌లో జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
భళా.. బౌలర్లు
ఫించ్ ధాటిగా ఆడిన తీరు చూస్తే భారత్‌కు భారీ లక్ష్యం ఖాయమనిపించినా డెత్ ఓవర్లలో భారత బౌలర్లు పట్టు సాధించిన తీరు అద్భుతం. 40 ఓవర్లలో 234/2 స్కోరుతో అత్యంత పటిష్టంగా ఉన్న ఆసీస్‌ను కనీసం 300 పరుగులు కూడా చేయకుండా నిలువరించగలిగారు. చివరి 10 ఓవర్లలో కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఫించ్ అవుటైన కొద్దిసేపటికే స్మిత్‌ను 42వ ఓవర్ చివరి బంతికి కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే క్రీజులో మ్యాక్స్‌వెల్ ఉండడంతో పరుగుల వరద ఖాయమనుకున్నా ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే అతడిని ధోని మెరుపు వేగంతో స్టంప్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బుమ్రా, భువనేశ్వర్ కట్టుదిట్టమైన బంతులకు ఆసీస్ పరుగుల కోసం విలవిల్లాడింది.
మెరిసిన రోహిత్, రహానే
లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత ఓపెనింగ్ జోడి రహానే, రోహిత్ ఆసీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ తమ బ్యాట్లను ఝుళిపించారు. రిచర్డ్‌సన్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో రోహిత్ కొట్టిన సిక్సర్‌కు బంతి స్టేడియం బయట పడింది. ఇక పదో ఓవర్‌లో రహానే మూడు ఫోర్లు సాధించడంతో పవర్ ప్లేలో భారత్ 68 పరుగులు చేసింది. 42 బంతుల్లో రోహిత్ శర్మ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు రహానే 50 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 22వ ఓవర్‌లో రోహిత్ ఆడిన పుల్ షాట్ భారీ సిక్సర్‌గా వెళుతుందనిపించినా నేరుగా సబ్‌స్టిట్యూట్ కార్ట్‌రైట్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రహానే కూడా కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు.
సూపర్ పాండ్యా
ఈ సమయంలో కోహ్లితో పాటు నంబర్ ఫోర్ స్థానానికి ప్రమోట్ అయిన పాండ్యా సూపర్ షో ప్రదర్శించాడు. తానెదుర్కొన్న నాలుగో బంతినే సిక్సర్‌గా మలిచాడు. అయితే 29వ ఓవర్ నుంచి ఏడు ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లు ఆధిక్యం ప్రదర్శించారు. ఈ మధ్యలో ఒక్క బౌండరీ కూడా రాకపోగా వరుస ఓవర్లలో కోహ్లి, జాదవ్ పెవిలియన్‌కు చేరడంతో ఒత్తిడి పెరిగింది. అయితే 37వ ఓవర్‌లో పాండ్యా 6, 4 బాది ఇన్నింగ్స్‌ను తిరిగి ట్రాక్‌లోకి తెచ్చాడు. అదే ఓవర్ చివరి బంతికి తను ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను స్మిత్ పట్టలేకపోయాడు. ఇదే జోరుతో 45 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. స్టొయినిస్ వేసిన 42వ ఓవర్‌లో పాండ్యా నాలుగు ఫోర్లతో విరుచుకుపడడంతో 18 పరుగులు వచ్చాయి. విజయానికి మరో 8 పరుగుల దూరంలో పాండ్యా వెనుదిరిగాడు. దీంతో మనీష్ పాండేతో కలిసి ఐదో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మరో 13 బంతులుండగానే భారత్ నెగ్గింది.
►తాజా విజయంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ 120 పాయింట్లతో దక్షిణాఫ్రికా (119)ను అధిగమించి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
►తర్వాతి రెండు వన్డేలకోసం ప్రకటించిన భారత జట్టులో జడేజా స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి వచ్చాడు.