
కోహ్లితో జత కలిసిన బేల్
న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ స్టార్టప్ వెంచర్ ‘స్పోర్ట్ కోన్వో’కు రియల్ మాడ్రిడ్ క్లబ్ ఫుట్‌బాల్ స్టార్ గారెత్ బేల్ మద్దతిచ్చాడు. అభిమానులతో ముచ్చటించేందుకు ఇది చక్కని వేదికగా ఉపయోగపడుతుందని కితాబిచ్చాడు. ఐఎస్‌ఎల్‌లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న కోహ్లి... లండన్‌కు చెందిన ఈ స్టార్టప్ వెంచర్‌తో రెండోసారి క్రీడలకు సంబంధించిన వ్యాపారంలోకి దిగాడు. అభిమానులు తమకు నచ్చిన క్రీడలతో పాటు ప్రస్తుత వార్తా కథనాలపై నేరుగా స్పందించేందుకు ఈ స్పోర్ట్ కోన్వో ఉపయోగపడుతుంది. అయితే కోహ్లి తన కోన్వో అకౌంట్‌లో బేల్ ఫొటోతో పాటు హార్ట్ సైన్‌ను పోస్ట్ చేసి ఫుట్‌బాలర్ కూడా ఇందులో చేరిపోయాడనే సంకేతాలిచ్చాడు. క్రికెట్‌తో పాటు భారత కెప్టెన్‌కు తాను పెద్ద అభిమానినని బేల్ తన మెసేజ్‌లో పేర్కొన్నాడు.