హైదరాబాద్: ఫామ్‌లో లేక వరుస వైఫల్యాలతో అన్ని వైపులా విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్‌కు సారథి విరాట్ కోహ్లి బాసటగా నిలిచాడు. శుక్రవారం నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో తొలి టీ20 నేపథ్యంలో ప్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పంత్‌పై విమర్శలపై స్పందించాడు. టీమ్ మేనేజ్‌మెంట్‌కు పంత్‌పై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని తేల్చిచెప్పాడు. మ్యాచ్‌లో పంత్ విఫలమైన ప్రతీసారి స్టేడియంలోని ప్రేక్షకులు ధోని అంటూ అరుస్తున్నారని, ముందుగా అలా అరవటం మానుకోవాలని సూచించాడు.
‘పంత్ సామర్థ్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతడు మ్యాచ్ విన్నర్. అయితే అతడు విఫలమైన సందర్భంలో మనం అండగా నిలవాల్సి ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పంత్ విపలమై మైదానం వీడుతుంటే అభిమానులు ధోని అని అరవడం ముందుగా ఆపేయాలి. ఇది సరైన పద్దతి కాదు. దేశం కోసం ఆడే ప్రతీ క్రికెటర్ ఎంతో నిబద్దత, క్రమశిక్షణతో ఆడతాడు. ఎప్పుడూ మంచిగా ఆడాలి, దేశానికి విజయాలు అందించాలని ఆలోచిస్తూనే ఉంటాడు. ఏ ఒక్క ఆటగాడు కావాలని అలాంటి పరిస్థితి తెచ్చుకోడు. ఇలాంటి సందర్భంలో అతడికి మద్దతుగా నిలవాలి. రోహిత్ శర్మ చెప్పినట్టు అతడిని స్వేచ్చగా వదిలేయండి.
ఇక పంత్ ఓపెనర్‌గా పంపిస్తారా అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులోని బ్యాట్స్‌మన్ ఏ స్థానంలోనైనా ఆడగలరు. ఉదాహరణకు వృద్దిమాన్ సాహాను తీసుకుంటే.. ఐపీఎల్‌లో అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగాడు. కోల్‌కతా టెస్టుకు ముందు సాహాతో అదే చెప్పా. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రెడీగా ఉండమని చెప్పా. ఇక వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా పూర్తిగా సిద్దమైంది. పొట్టి ఫార్మట్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు’అని కోహ్లి పేర్కొన్నాడు.
కాగా, ప్రపంచకప్ అనంతరం ధోని క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో ధోని వారసుడిగా పంత్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచానాలను అందుకోవడంలో పంత్ వరుసగా విపలమువుతున్నాడు. దీంతో పంత్ స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలని క్రీడా పండితులు సూచిస్తున్నారు.
ఇక కీలక టీ20 ప్రపంచకప్-2020కు ముందు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని టీమిండియా భావిస్తోంది. దీనిలో భాగంగా విండీస్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. దీని తర్వాత డిసెంబర్ 15నుంచి వన్డే సిరీస్ కూడా ప్రారంభం కానుంది. ప్రపంచకప్ అనంతరం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment